ఆదివారం ఆ ఇద్దరూ కలుసుకుంటారట..

Update: 2015-10-17 08:57 GMT
అనుకోకుండా కలుసుకునే అవకాశం ఏర్పడితేనే ముఖం ముఖం ఎదురుపడకుండా తప్పించుకునేటంతటి వైరం వారిద్దరి మధ్య ఉంది. ఆయన వచ్చే చోటికి ఈయన వెళ్లరు.. ఈయన వెళ్లే చోటికి ఆయన రారు. చివరకు రాష్ట్రపతి వచ్చినా సరే ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడకుండా భలే టైం మెంటైన్ చేస్తారు. అలాంటిది..'' నేనొచ్చి కలుస్తా, ఎప్పుడు కుదురుతుందో చెప్పండి '' అని మొదలుపెట్టి ''రేపు ఓకేనా... కలుద్దామా'' అని అడిగితే ఇంకేముంది! ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరో ఈ సరికే అర్థమై ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు -చంద్రశేఖరరావులే ఆ ఇద్దరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేసీఆర్ ను కలవడానికి చంద్రబాబు అపాయింట్ మెంటు కోరారు. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడానికి ఆదివారం వస్తానని కబురు పంపించారు. ఇంట్లో శుభకార్యం జరిగితే పాత గొడవలన్నీ మర్చిపోయి పక్కింటివాళ్లను పిలవడం పద్ధతి కదా. చంద్రబాబు ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపాయింట్‌ మెంట్ కోరారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్‌ మెంట్ కోరారు.  ఆదివారం సాయంత్రం చంద్రబాబు వస్తారని సమాచారం ఇచ్చారు. దీనికి కేసీఆర్ కార్యాలయం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా కేసిఆర్‌ ను స్వయంగా కలిసి అమరావతి శంకుస్థాపనకు రావాలని కోరుతానని చంద్రబాబు ఇదివరకే చెప్పారు. ఆ ప్రకారమే ఆయన కేసీఆర్ ను కలవబోతున్నారు.

వీరిద్దరి భేటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కొద్ది నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను మర్చిపోయి ఇద్దరూ ఎలా వ్యవహరిస్తారు..? ఏం మాట్లాడుకుంటారు..? ఈ భేటీ తరువాతైనా ఇద్దరి మధ్య సఖ్యత కుదురుతుందా అన్న చర్చలు రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి.
Tags:    

Similar News