కాలేజీలు మూయించే దమ్ము బాబుకుందా?

Update: 2016-01-27 04:32 GMT
ఏపీ సీఎం చంద్రబాబుకు కోపం వచ్చేసింది. నిన్నమొన్నటి వరకూ కూల్ కూల్ గా ఉండే బాబు హాట్ హాట్ గా మారిపోతున్నారు. విషయం ఏదైనా కానీ చిరాకు పడిపోతున్నారు. ఎదుట ఎవరున్నా సరే మండిపడటం ఇప్పుడు మామూలైంది.  సొంత జట్టులోని మంత్రులు మొదలు.. ప్రతి ఒక్కరి మీదా సీరియస్ అవుతున్న బాబు నోట తాజాగా వచ్చిన మాట చర్చనీయాంశంగా మారింది.

ప్రైవేటు కాలేజీల పని తీరుపై తీవ్రస్థాయిలో సీరియస్ అయిన చంద్రబాబు.. నాణ్యత.. ప్రమాణాల విషయంలో రాజీ లేదని.. ఆ విషయంలో తేడా చేసే వారికి భారీ శిక్షలు తప్పవని వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. నిబంధనల మేరకు ప్రమాణాలు పాటించని ఇంజరింగ్ కళాశాలల్ని మూయించి వేస్తానని తేల్చి చెప్పటం ఇప్పుడు సంచలనంగా సృష్టిస్తోంది. ప్రైవేటు కాలేజీల పని తీరు మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నచంద్రబాబు.. తన మంత్రి వర్గంలోని మంత్రి నారాయణ కు సంబంధించిన కళాశాలలోనూ నాణ్యత లోపించిందన్న విషయాన్ని ప్రస్తావించటం ఇప్పుడు కలకలంగా మారింది.

ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కళాశాలల్ని మూసివేస్తామని బాబు ప్రకటించినట్లే.. వాస్తవంగా జరుగుతుందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే.. కేసీఆర్ ఇంజనీరింగ్ కాలేజీల మీద దృష్టి పెట్టి కొరడా విదల్చటం తెలిసిందే. ఈ విషయంలో ఏపీ సర్కారు వమౌనంగా ఉన్నా.. కేసీఆర్ మాత్రం ఎలాంటి మొహమాటాలకు గురి కాకుండా నాణ్యత లేని కళాశాలలపై వేటు వేసేశారు. ఒకదశలో తన మంత్రివర్గంలోని మంత్రి కళాశాలపైనా వేటు వేసేందుకు సైతం వెనుకాడలేదు. మరి.. కేసీఆర్ ప్రదర్శించేంత దమ్ము.. ధైర్యం చంద్రబాబు ప్రదర్శిస్తారా? అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

మొహమాటానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన చంద్రబాబు.. అబ్లిగేషన్ లో భాగంగా మరికొంత కాలం మొహమాటాల్ని మోస్తే మొదటికే మోసం వచ్చేయటం ఖాయమన్న ఫీడ్ బ్యాక్ తోనే బాబులో ఇంత మార్పు వచ్చిందంటున్నారు. నిజానికి.. మొహమాటంగా ఉన్నంత కాలం అందరి పనులు చేసి పెట్టాల్సి రావటం.. అంతిమంగా ఇది ప్రభుత్వంపై నెగిటివ్ గా మారిందన్న భావనకు బాబు వచ్చేశారని చెబుతున్నారు.

ఇలాంటివి మరికొంత కాలం కొనసాగితే తన పాలనకు మరింత చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచనే చంద్రబాబు చేత సంచలన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయంటున్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలపై ప్రభుత్వానికి నియంత్రణ లోపించటం.. ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిచటంతో.. రాజకీయ పలుకుబడి దండిగా ఉన్న నేపథ్యంలో బాబే స్వయంగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. తాజాగా చేస్తున్న ప్రకటనలు ఆ దిశగా సాగుతున్న ప్రయత్నాలుగా చెప్పొచ్చు. తాను చెప్పే మాటల విషయంలో తానెంత కరుకుగా ఉంటానన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేయటం కోసమైనా.. కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలపై వేటు పడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి.. అదెప్పుడన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News