ప్రైవేటుపై మోజు ఎందుకు బాబు?

Update: 2015-11-12 05:49 GMT
ఒక‌వైపు ఆర్థిక‌లోటు - ఖ‌జానా ఖాళీతో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రోవైపు అందుకు పూర్తి విరుద్ధ‌మైన రీతిలో నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇందుకు అధికారులు - స్థానిక నేత‌లు - లేదా ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ‌రు కార‌ణ‌మ‌నేది తెలియ‌న‌ప్ప‌టికీ.....అంతిమంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఖ‌జానాకు భారీగా భారం ప‌డిపోతోంది. రాజ‌ధాని త‌ర‌లింపు నేప‌థ్యంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలొచ్చే ఉద్యోగులకు సరిపోయే విధంగా కార్యాలయాలను ఎంపిక చేసుకునే విషయంలోనూ ఏపీ ప్రభుత్వం ప్రైవేటుకు పెద్దపీట వేస్తోంది. విజయవాడలో పెద్దఎత్తున ప్రభుత్వ భవనాలున్నా వాటి జోలికెళ్లడం లేదు.

విజ‌య‌వాడ‌కు తరలి వచ్చే ఉద్యోగులకు కనీసం 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు అవసరం. కానీ ప్రభుత్వం అంతకంటే రెట్టింపు విస్తీర్ణాన్ని అద్దెకు తీసుకోవాలని భావిస్తోంది. అందుకు విజయవాడ - గుంటూరు సమీపాల్లోనూ - నాగార్జున వర్సిటీ ముందున్న భవనాలనూ అద్దె ప్రాతిపదికలో తీసుకోవాలని నిర్ణయించింది. ఒక్కో ఫ్లాటుకు కనీసం రూ.10 వేల నుండి రూ.13 వేల వరకూ అద్దెలు చెల్లించాలని, విల్లాలకు కనీసం రూ.19 వేల వరకూ అద్దె చెల్లించాలని అంచనాలు రూపొందించింది. వీటిల్లో ఎక్కువభాగం హైదరాబాద్‌ నుండి ఇక్కడకు వచ్చే వారికి కేటాయించాలని నిర్ణయించారు. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని భవనాల గురించి పట్టించుకోవడం లేదు.

ప్రస్తుతం విజ‌య‌వాడ‌ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని భవనాలను లీజు పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారు. వీటిలో కీలకమైనవి కాళేశ్వరరావు మార్కెట్‌ - ఎన్‌ టిఆర్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ - చిట్టూరి కాంప్లెక్స్‌ వంటి అతిపెద్ద నిర్మాణాలున్నాయి. ఇవి కాకుండా కేవలం షాపింగ్‌ ల కోసమే కేటాయించిన స్థలాలు మరో 20 వరకూ ఉన్నాయి. వీటిలో భవనాలు నిర్మించి షాపింగు కాంప్లెక్స్‌ లకు ఇచ్చి, అదనపు విస్తీర్ణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవచ్చు. ఒకవేళ కార్పొరేషన్‌ కు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందనుకుంటే అద్దెలూ లీజు పద్ధతిలోనే చెల్లించొచ్చు. ఈవిధానం వల్ల ప్రభుత్వ స్థలం వినియోగం అవ్వడంతో పాటు కార్పొరేషన్‌ కూ ఆదాయం వస్తుంది. కాలువ కట్టలపై పెద్దఎత్తున ఫంక్షన్‌ హాళ్లు నిర్మించి కొన్ని సంఘాలు లీజు పద్ధతిలో నిర్వహిస్తున్నాయి. వాటి స్థానంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. ఇలాంటి ఆదా మార్గాల గురించి ప్రభుత్వం ఆలోచించాల్సింది పోయి ప్రైవేటుకు పెద్ద పీట వేయ‌డం ఎంత‌వ‌ర‌కు సమంజ‌సం అనే ప్రశ్న‌లు త‌లెత్తుతున్నాయి.
Tags:    

Similar News