బాబు చేసిన ప‌ని కూడా చేయ‌లేవా కేసీఆర్‌?

Update: 2019-04-24 05:57 GMT
అన్ని సంద‌ర్భాల్లో మౌనం ఏ మాత్రం స‌రికాదు. కొన్ని సంద‌ర్భాల్లో మౌనంగా ఉండ‌టం నేరం అవుతుంది. త‌న‌కు ప్ర‌తికూలంగా ఉన్న సంద‌ర్భాల్లో చ‌ప్పుడు చేయ‌ని త‌త్త్వం కేసీఆర్ సొంతం. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఇంట‌ర్ బోర్డు నిర్వాకంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల వెల్ల‌డిలో చోటు చేసుకున్న త‌ప్పులు ఒక ఎత్తు అయితే.. ఫెయిల్ అయ్యామాన్న బాధ‌తో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం సంచ‌ల‌నంగా మారింది.

గ‌తంలో చేసుకున్న సూసైడ్ల‌తో పోలిస్తే.. ప్రస్తుత ప్ర‌భుత్వ హ‌యాంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారి సంఖ్య త‌క్కువ‌గా ఉందంటూ చేస్తున్న స‌మ‌ర్థింపు చీద‌ర పుట్టేలా ఉంది. ఒక‌వైపు వేద‌న‌తో ప్రాణాలు వ‌దిలితే.. దాని కార‌ణంగా త‌మ ప్ర‌భుత్వానికి జ‌రిగే డ్యామేజ్ లెక్క‌లు వేసుకొని క‌వ‌ర్ చేసుకుంటున్న వైనం ప‌లువురికి మంట పుట్టేలా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న పిల్ల‌ల్నిఉద్దేశించి కానీ.. ప‌లితాల వెల్ల‌డి విష‌యంలో ఇంట‌ర్ బోర్డు ఫెయిల్ అయ్యింద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ స్సందిస్తే బాగుండేది.

విలేక‌రుల స‌మావేశం పెట్ట‌కున్నా.. క‌నీసం సోష‌ల్ మీడియాలో అయినా పోస్ట్ చేస్తే మ‌రోలా ఉండేది. కానీ.. అదేమీ లేకుండా 16 మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న వైనంపై ప్ర‌భుత్వాధినేత‌గా క‌నీస స్పంద‌న లేక‌పోవ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. ప‌క్క‌నున్న ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాజాగా ట్విట్ట‌ర్ లో స్పందించారు. తెలంగాణ‌లో ఇంట‌ర్ ఫ‌లితాలు సానుకూలంగా రాలేదంటూ 16 మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ఉదంతంపై విషాదాన్ని ప్ర‌క‌టించారు.

ప్ర‌పంచ చ‌రిత్ర‌లో విజేత‌లంద‌రి ఆరంభంలో ప‌రాజితులేన‌ని చెప్పిన ఆయ‌న‌.. మంచి ఫ‌లితాల కోసం ఏం చేయాల‌న్న దానిపై కొన్ని ట్వీట్స్ పెట్టారు. తెలంగాణ‌లో చోటు చేసుకున్న ఆత్మ‌హ‌త్య‌ల‌పై ప‌క్క రాష్ట్ర సీఎం చంద్ర‌బాబు రియాక్ట్ అయితే.. సొంతోళ్లు అంత‌మంది మ‌ర‌ణిస్తే.. అయ్యో ఇలా జ‌రిగిందేమిటి? అన్న ట్వీట్ కేసీఆర్ నుంచి రాక‌పోవ‌టంపై ప‌లువురు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

చంద్ర‌బాబు చేసిన ట్వీట్లు చూస్తే..

+  మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాలలో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే - బంగారు భవిష్యత్తు మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు - దేశానికి  మీరిచ్చే బహుమతి.

+  మీ ముందెంతో సుందరమైన బంగారు భవిష్యత్తు ఉంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే..చదువు అనేది కేవలం విజ్ఞానానికే, అదే జీవితం కాదు. ఓటమి విజయానికి తొలిమెట్టు.

+  పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి, మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతేర్చకండి. ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండి.

+  విద్యార్ధులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు - పాస్ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవి.

+  పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో 16 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
   

Tags:    

Similar News