రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తి అయ్యాయి. అప్పటికే పదేళ్ల పాటు విపక్ష నేత హోదాలో అధికారం కోసం తహతహలాడిన టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తిరిగి తాను అధికారంలోకి వచ్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను సంధించారు. రాజధానే లేని రాష్ట్రానికి అన్నీ సమకూరాలంటే తనలా అనుభవజ్ఞుడైన నేతే సీఎం కావాల్సి ఉందని ఆయన తన పార్టీ నేతలు - కార్యకర్తలతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అనుభవ లేమితో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి వారికి అధికారం ఇస్తే... రాష్ట్రం మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతుందని చెబుతూ జనాన్ని టీడీపీ నేతలు బాగానే బుట్టలో వేసేసుకున్నారు. ఇక ఆ తర్వాత రైతులకు రుణమాఫీని కూడా ఓ అస్త్రంగా ప్రయోగించిన చంద్రబాబు ప్రజలను మరింతగా లాగేశారనే వాదన లేకపోలేదు. ఇక వైఎస్ జగన్ కు వీస్తున్న గాలిని పూర్తిగా తనవైపు తిప్పుకునేందుకు రంగంలోకి దిగిపోయిన చంద్రబాబు... భారీ ప్రచార ఆర్భాటానికి తెర తీశారు.
*జాబు కావాలంటే... బాబు రావాల్సిందే*నంటూ టీడీపీ నుంచి దూసుకువచ్చిన ఆయుధం... యువతను ఆకట్టుకుంది. ఈ మాటేదో బాగానే ఉందని భావించిన చంద్రబాబు అండ్ కో... *జాబు కావాలంటే.. బాబు రావాలి* అన్న ప్రచార అస్త్రాన్ని బాగానే వినియోగించింది. ఇక చివరగా ట్రంప్ కార్డు మాదిరిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారాన్ని బాబు ప్రయోగించారు. యువతలో మంచి క్రేజ్ ఉన్న పవన్ ప్రచారం చేస్తే సామాజిక వర్గాలకు అతీతంగా యువత తనవైపు తిరుగుతారని, రాష్ట్రంలో మెజారిటీ వర్గంగా ఉన్న కాపుల్లోనూ చీలిక తేవచ్చన్న చంద్రబాబు పాచిక నిజంగానే బాగానే పనిచేసిందని చెప్పాలి. ఇలా అధికారం చేజిక్కించుకునేందుకు చంద్రబాబు తన అమ్ములపొదిలోని అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీశారు. దాదాపు నలభై ఏళ్ల రాజకీయ అనుభవంతో చంద్రబాబు వేసిన ప్లాన్ గత ఎన్నికల్లో వర్కవుట్ అయ్యింది.
అదే సమయంలో మాట ఇచ్చి తప్పడం తన వల్ల కాదంటూ రైతుల రుణమాఫీపై నోరు మెదపడానికే ఇబ్బంది పడ్డ వైఎస్ జగన్ మాత్రం విపక్షానికి పరిమితమైపోయారు. ఇది జరిగి ఇప్పటికే మూడున్నరేళ్లకు పైగా అవుతోంది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలకు సన్నాహకంగా వైఎస్ జగన్ ప్రజా సంకల్పం పేరిట భారీ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇవతలి వైపు నుంచి చంద్రబాబు కూడా ఎన్నికల కసరత్తు ఎప్పుడో మొదలుపెట్టేశారనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీదే అధికారం అన్న దిశగా చంద్రబాబు పక్కా మంత్రాంగం నెరపుతున్నారు. విపక్షంపై వరుసగా దాడులు చేయడం - బలమైన విపక్షాన్ని బలహీనంగా మార్చేయడం లాంటి పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తి అయ్యాయన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. ఇక తానేం చేసినా ప్రజలు తనకే ఓటు వేస్తారన్న ఫీలింగ్ చంద్రబాబుకు లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రజల చేతిలో ఆయన చాలా సార్లు పెద్ద దెబ్బలే తిన్నారు.
మరి వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి తీరాలంటే ఏం చేయాలి? జనాన్ని బ్లాక్ మెయిల్ చేయాల్సిందే. వినడానికి కాస్తంత ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజమేనట. ఈ మాట అంటున్నది వేరేవరో కాదు. టీడీపీ సర్కిల్స్‌లోనే ఈ మాట జోరుగా వినిపిస్తున్నది. గెలుపు దిశగా సుదీర్ఘంగా యోచించిన చంద్రబాబు... ఈ పాశుపతాస్త్రం లాంటి అస్త్రాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాశుపతాస్త్రంపై టీడీపీ శ్రేణులకు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెళ్లగా... ఆ మాటే తమను గెలిపిస్తుందని టీడీపీ వర్గాలు చాలా ధీమాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మాట టీడీపీ సర్కిల్స్ దాటి ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. అయినా ఆ మాట ఏంటంటే... *అమరావతి పూర్తి కావాలంటే... బాబు రావాల్సిందే*. ఈ విషయం గురించి కాస్తంత లోతుగా వెళితే... నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ఓ రూపు తెచ్చిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడుగుతానని బాబు గతంలోనే చెప్పారు. అయితే అమరావతిలో ఆశించినంత వేగంగా ఏమీ పనులు సాగడం లేదు.
రైతుల నుంచి రాజధాని నిర్మాణం కోసమంటూ 33 వేల ఎకరాలకు పైగా భూములను లాగేసుకున్న చంద్రబాబు... అందులో ఓ తాత్కాలిక సచివాలయం - తాత్కాలిక అసెంబ్లీ భవన సముదాయం మాత్రమే నిర్మించారు. ఈ రెండు నిర్మాణాలు తప్పించి 33 వేల ఎకరాల విస్తీర్ణంలో బాబు కట్టిందేమీ లేదు. మరి ఈ రెండు భవనాలు... అవి కూడా తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టిన నిర్మాణాలను చూపి బాబు ఓట్ల కోసం జనం వద్దకు వెళతారా? అంటే వెళ్లక తప్పదన్న మాటే వినిపిస్తోంది. రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే... ఈ దఫా తనక ఓటు వేయాల్సిందేనన్న ప్రచారాస్త్రంతో చంద్రబాబు బ్లాక్ మెయిలింగ్ ప్రచారానికి దిగనున్నారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ మాట చెప్పుకోవడానికే అమరావతిలో పనుల వేగాన్ని పెంచేందుకు చంద్రబాబు ససేమిరా అంటున్నారన్న విశ్లేషణలు కూడా లేకపోలేదు. కాకపోతే శంకుస్థాపనలు మాత్రం ఎన్నికల ముందు నాటికి అయిపోతాయి. మరి ఈ బ్లాక్ మెయిలింగ్ అస్త్రం చంద్రబాబుకు ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాలి.