అధికారం కోసం అరెస్ట్ డ్రామా..బాబా మజాకా.?

Update: 2018-09-16 07:48 GMT
చంద్రబాబు మరోసారి ప్రజల కళ్లకు గంతలు కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. లేనిపోనివి ప్రచారం చేస్తూ సానుభూతి పొందేందుకు నాటకాలాడుతున్నారు.. మహారాష్ట్రలోని ధర్మ బాద్ కోర్టు చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్లు ఎప్పుడైతే జారీ చేసిందో అప్పటి నుంచి టీడీపీ నేతలు - పచ్చమీడియా మొసలి కన్నీరు కారుస్తున్నారు. బాబును అన్యాయం చేస్తున్నారని.. బీజేపీ కక్ష సాధిస్తుందంటూ నమ్మించడానికి నానా పాట్లు పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తరిచి చూస్తూ చంద్రబాబు అసలు మోసం బయటపడుతుందని పలువురు విశ్లేషణలు చేస్తున్నారు.

చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ల వెనుక అసలు రహస్యాన్ని తరిచిచూస్తే పెద్ద కుట్రే దాగి ఉంది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకొని ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఆడుతున్న నాటకాలు బయటపడే పరిస్థితి కనిపిస్తోంది.

అది 2010.. చంద్రబాబు - తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడే కడుతున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహారాష్ట్ర వెళ్లి నిరసన తెలిపారు. అప్పుడు మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.. దీంతో చంద్రబాబును టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయించి ఓ కాలేజీలో నిర్బంధించింది. అనంతరం అతి కష్టంమీద  విమానాలు ఎక్కించి హైదరాబాద్ పంపించేసింది. వారి మీద కేసులు కూడా పెట్టింది. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది.

ఇక కేసులు పెట్టాక కోర్టులు ఊరుకుంటాయా..? న్యాయపరంగా తమ వద్దకు వచ్చిన కేసుల్లో నోటీసులు జారీ చేసింది. కానీ ఆ నోటీసులను చంద్రబాబు సహా టీడీపీ నేతలు లైట్ తీసుకున్నారు. వాయిదాలకు వెళ్లలేదు. దీంతో ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. తదుపరి విచారణ 21కు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని వారెంట్లు జారీచేశారు.ఈ మొత్తం వ్యవహారం  కోర్టు పరిధిలోని అంశం.

మరి ఇప్పుడు చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు ఇందులో బీజేపీకి ఏం సంబంధం.. అసలు నరేంద్రమోడీ ప్రమేయం ఏమైనా ఉందా.? బీజేపీని బాబు నిందించడంలో అర్థం ఉందా అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఇచ్చిన వారెంట్లకు మోడీని బదనాం చేయడం ఎంతవరకూ కరెక్ట్ అని నిలదీస్తున్నారు. చంద్రబాబు ప్రజల్లో సానుభూతి కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడుతున్నారు. చంద్రబాబు మీద కేసు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని.. ఆ పార్టీతోనే ఇప్పుడు చెలిమి చేస్తూ సంబంధం లేని అరెస్ట్ వారెంట్లలో బీజేపీని బ్లేమ్ చేయడం ఎంతవరకూ కరెక్ట్ అని వారు నిలదీస్తున్నారు. కేసు పెట్టిన కాంగ్రెస్ వాళ్లతోనే ఊరేగుతూ ఏ పాపం తెలియని బీజేపీని - మోడీని బాబు టార్గెట్ చేయడంపై దుమ్మెత్తి పోస్తున్నారు. టీడీపీ చౌకబారు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళతామని స్పష్టం చేస్తున్నారు.
Tags:    

Similar News