బాబుకు ఒలింపిక్స్ మోజు ఇంకా త‌గ్గ‌లేదు

Update: 2018-01-08 07:48 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఒలింపిక్స్ మోజు త‌గ్గ‌న‌ట్లుంది. గ‌తంలో ఓ సారి అమ‌రావ‌తిలో ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ గురించి కామెంట్లు చేసిన తీరుపై..సోష‌ల్ మీడియాలో సెటైర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ...సీఎం చంద్ర‌బాబు ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు. అమరావతి కేంద్రంగా ఒలింపిక్స్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయ‌న మ‌రోమారు నొక్కి వ‌క్కాణించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం నుండి ముఖ్యమంత్రి ఇంటి వరకు - తిరిగి స్టేడియానికి మారథాన్ రన్ నిర్వహించారు. 21కే - 10కే - 5కే రన్‌ లు డీప్ స్వచ్ఛంద సంస్థ - శాప్ - వీఎంసీ - పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగాయి. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన అమరావతి మారథాన్ ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.

నేడు చిన్న దేశాలు సైతం ఒలింపిక్స్ నిర్వహిస్తున్నాయని, ప్రపంచంలోనే పెద్దదైన మన దేశం ఇంతవరకు ఒలింపిక్స్ నిర్వహించలేక పోవటం లోటుగా కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే అమరావతి కేంద్రంగా ఒలింపిక్స్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. కాగా, అమరావతి మారథన్‌ కు రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నామని - మూడేళ్ల కాలంలోనే ఈ రన్‌ కు మంచి గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు శారీరకంగా - మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనేదే తన కోరికని - అందుకే క్రీడా రంగానికి ప్రాముఖ్యత ఇస్తున్నామని చెప్పారు.  అమరావతి మారథాన్ చూడడానికి వచ్చినవారు వచ్చే ఏడాది రన్‌లో పాల్గొంటారని - ఈ ఏడాది పతకం రానివారికి వచ్చే సంవత్సరం వచ్చే అవకాశం ఉందంటూ ఉత్సాహపర్చారు. గుంటూరు పూర్వ కలెక్టర్ కాంతిలాల్ దండే మూడు మారథాన్‌ లలో పాల్గొని 21కే రన్ పూర్తిచేయడం అభినందనీయమన్నారు. పరుగెత్తిన వారికి పతకం రాకపోయినా ఫిట్ నెస్ దక్కుతుందని - తద్వారా ఆరోగ్యంగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం అవసరమన్నారు.

అమరావతి మారథాన్‌ ను తిరుపతి - విశాఖపట్నం - విజయవాడలలో నిర్వహించడం అభినందనీయమని - ఆదివారం నిర్వహించిన మారథాన్‌ లో 7500 మంది పాల్గొనడం మంచి పరిణామమని సీఎం చంద్ర‌బాబు అన్నారు. జాతీయ - అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొనడం వల్ల తక్కువ కాలంలోనే దీనికి మంచి ఆదరణ లభించిందన్నారు. హైదరాబాద్‌ లో 23 సంవత్సరాల క్రితం 10కే రన్ నిర్వహించామని - ఇప్పుడు దేశంలోనే అమరావతి మారథాన్ రెండో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో మారథాన్‌ లు నిర్వహించాలని అంటూ జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరూ ఆటలు ఆడటం అలవాటు చేసుకోవాలని - ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌ గా తయారుచేయడమే మన లక్ష్యం కావాలన్నారు.
Tags:    

Similar News