టీడీపీలో 45 మంది సిట్టింగ్‌ ల‌కు ఛాన్స్ క‌ష్ట‌మేన‌ట‌!

Update: 2017-12-26 15:30 GMT
2019 ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది మాత్ర‌మే స‌మ‌య‌ముంది. ఏడాది అంటే ఎంత‌... ఓ 12 నెల‌లు. క్ష‌ణాల్లా గ‌డిచిపోతున్న 12 నెల‌లు గ‌తించేందుకు పెద్ద‌గా స‌మ‌య‌మేమీ లేద‌నే చెప్పాలి. ఇదే విష‌యం అర్థ‌మ‌య్యిందో - ఏమో... తెలియ‌దు గానీ... వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా విఫ‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికే ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట సుదీర్ఘ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టేశారు. ఈ యాత్ర ఇప్ప‌టికే రెండు జిల్లాలో పూర్తి కాగా... మూడో జిల్లా అయిన అనంత‌పురంలో త్వ‌ర‌లోనే ముగియ‌నుంది. ఆ త‌ర్వాత జ‌గ‌న్‌... టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో అడుగుపెట్ట‌నున్నారు. ఈ యాత్ర‌తో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణికిస‌లాడుతుండ‌గా... అధికార టీడీపీలో మాత్రం అంత‌కంత‌కూ టెన్ష‌న్ పెరిగిపోతోంది. ఇదే స‌మ‌యంలో అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంత‌మంది సిట్టింగ్‌ లు విజ‌యం సాధిస్తారు? ఎవ‌రెవ‌రికి టికెట్లివ్వాలి? ఎవ‌రెవ‌రికి మొండిచెయ్యి చూపాలి? అన్న విష‌యాల‌పై ఇప్ప‌టికే దృష్టి సారించిన చంద్ర‌బాబు... టికెట్లిచ్చినా గెలిచే స‌త్తా లేని టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 45గా ఉన్న‌ట్లు దాదాపుగా నిర్ధారించేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌య‌మున్న నేప‌థ్యంలో మ‌రోమారు స‌ర్వే నిర్వ‌హించి ఈ 45 మంది భ‌విష్య‌త్తును చంద్రబాబు తేల్చేయ‌నున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తే... ఈ 45 మంది సిట్టింగ్‌ ల‌కు టికెట్లు క‌ష్ట‌మేన‌ని సంకేతాల‌ను చంద్రబాబు వ‌దిలేశారు. దీంతో ఆ 45 మంది ఇప్పుడు ఏం చేయాలా? అంటూ అంత‌ర్మ‌ధ‌నంలో ప‌డిపోయారు. ఈ 45 మంది ఎవ‌ర‌న్న విష‌యం అయితే బ‌య‌ట‌కు రాలేదు గానీ... ఆయా జిల్లాల‌కు చెందిన పార్టీ సీనియ‌ర్ల‌కు జాబితాలు పంపించేసిన చంద్ర‌బాబు... స‌ద‌రు సిట్టింగ్‌ లు ప‌ద్ద‌తి మార్చుకుంటే స‌రేస‌రి... లేదంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లిచ్చేది లేదంటూ కాస్తంత క‌ఠినంగానే చెప్పేశార‌ట‌. ఇంత‌దాకా బాగానే ఉన్నా... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీకి క‌డ‌ప‌ - క‌ర్నూలు జిల్లాలు పెట్ట‌ని కోటల్లా ప‌రిణ‌మిస్తే... కోస్తాంధ్ర‌లోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా టీడీపీకి కంచుకోట‌గా మారిపోయింది. ఆ జిల్లాలోని మొత్తం 15 నియోజవ‌ర్గాల్లో 14 స్థానాల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంటే... మిగిలిన ఒక్క స్థానాన్ని టీడీపీ మిత్ర‌ప‌క్షంగా బ‌రిలోకి దిగిన బీజేపీ గెలుచుకుంది. అంటే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఆ జిల్లాలో విప‌క్ష వైసీపీకి సింగిల్ సీటు కూడా ద‌క్క‌లేద‌న్న మాట‌.

అంతేనా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌రిధిలోని రెండు పార్ల‌మెంటు నియోజవ‌ర్గాల‌ను కూడా టీడీపీ-బీజేపీ కూట‌మి ఎగుర‌వేసుకుపోయింది. ఉన్న రెండు స్థానాల్లో ఓ స్థానాన్ని టీడీపీ కైవ‌సం చేసుకోగా... మ‌రో స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. మొత్తంగా అటు ఎంపీ సీట్లు చూసినా... ఇటు ఎమ్మెల్యే సీట్లు చూసినా... ఆ జిల్లాలో మొత్తం అధికార కూటమి కే ద‌క్కాయి గానీ.... విప‌క్షానికి సింగిల్ స్థానం కూడా ల‌భించ‌లేదు. అయినా ఇప్పుడు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా సంగ‌తిని ఎందుకు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సి వ‌స్తొందంటే... టికెట్లిచ్చినా గెలవ‌లేని 45 మంది టీడీపీ సిట్టింగుల జాబితాలో ఐదుగురు ఆ జిల్లాకు చెందిన వారే ఉన్నార‌ట‌. పార్టీకి కంచుకోట‌గా ఉన్న జిల్లాలోనే ఐదుగురు ఎమ్మెల్యేల ప‌రిస్థితి అసంతృప్తిక‌రంగా ఉంటే... చంద్ర‌బాబుకు కోపం రాదా? మ‌రి. అందుకే మొత్తం జాబితాను రూపొందించిన ఆయ‌న ఆయా జిల్లాల‌కు చెందిన పార్టీ ఇన్‌ చార్జీల‌కు స‌ద‌రు జాబితాల‌ను పంపి... గెల‌వ‌లేని ఎమ్మెల్యేల‌ను అల‌ర్ట్ చేయాల‌ని - ప‌ద్ద‌తి మార్చుకోక‌పోతే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగ్‌ ల‌న్న విష‌యాన్ని కూడా ప‌క్క‌న పెట్టేసి మొండి  చెయ్యి చూప‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించార‌ట‌. అంటే మొత్తంగా గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌రిస్థితి చూస్తుంటే... బాబుకు నిద్ర ప‌ట్ట‌డం లేద‌ట.
Tags:    

Similar News