ఎమ్మెల్యేలు-ఐఏఎస్ లకు పాకెట్ మనీ తగ్గించారు

Update: 2015-10-29 17:30 GMT
సివిల్ సర్వీసెస్ అధికారులు - మంత్రులు - శాసనసభ్యుల రవాణా - బస చార్జీలు రోజురోజుకూ తడిసిమోపెడు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అత్యంత ఖరీదైన ప్రయాణాలు చేయడం, విమానాల్లో లగ్జరీ క్లాస్ టిక్కెట్లు - ఖరీదైన కార్లలో ప్రయాణం ప్రభుత్వానికి భారంగా మారుతోంది. గత ఏడాది కాలంలో అధికారులు - ప్రజా ప్రతినిధులు కలిపి రవాణా - బస కోసం చేసిన ఖర్చే 50 కోట్లు.. సీఎం పర్యటనల వ్యయం దీనికి అదనం. దీంతో చంద్రబాబు  ఈ విషయంపై సీరియస్ అవుతున్నారు. పొదుపు తప్పదని సూచనలిచ్చారు. ఇటీవల 12 కోట్ల రూపాయలు వెచ్చించి తుళ్లూరులో తాత్కాలిక శాసనసభ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన సిఎం , తాజాగా సీనియర్ అధికారుల వ్యవహార సరళిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆరు నెలల క్రితమే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీనియర్ అధికారులు ‘లగ్జరీ’ విడనాడాలని సిఎం సూచించారు. స్టార్ హోటళ్లలో బస చేయకుండా ప్రభుత్వ విడిది గృహాల్లోనే బస చేయాలని సూచించారు. అందుకు అవసరమైన రీతిలో అతిథి గృహాలకు మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. అయితే సిఎం ఆదేశాలను అధికారులు గాలికి వదిలేశారు. ఆఖరి నిమిషంలో పర్యటనలు - విదేశీ పర్యటనలు - శిక్షణ - పర్యవేక్షణ - పరిశీలన పర్యటనలు చేస్తూ ఐఎఎస్ - ఐపిఎస్ అధికారులు చేసిన పర్యటనలు ఆర్థిక శాఖకు తలకు మించిన భారంగా తయారైంది. దీంతో బిల్లుల ఆమోదంపై ఆంక్షలు విధించాలని, బిల్లులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతనే వాటిని ఆమోదించాలని సిఎం పేర్కొన్నా, వ్యవహారం చేయిదాటింది. దాంతో తాజాగా ఇందుకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలతో ఉత్తర్వులు ఇవ్వాలని సిఎం ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం.

ఇదేసమయంలో తన పర్యటనలను ఎవరైనా వేలెత్తి చూపుతారన్న ఉద్దేశంతో ఆయన స్వయంగా విజయవాడలో ఉంటూ పాలన సాగించాలని.... విదేశీ పర్యటనలను సైతం తక్కువ ఖర్చుతో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది చివరిలో సిఎం దక్షిణ కొరియా పర్యటించాల్సి ఉంది. తన పర్యటనల్లో కూడా క్రమశిక్షణ పాటిస్తూ, అధికారులకు మార్గదర్శకంగా ఉండాలని సిఎం యోచిస్తున్నట్టు సమాచారం. అధికారులు ఒక రోజుకు 15వేల రూపాయలు వెచ్చిస్తూ కార్లలో తిరుగుతున్న విషయం తెలియడంతో ఆయన మొత్తం విషయంపై ఆరా తీసి ఖర్చులు తగ్గించాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట.
Tags:    

Similar News