కేంద్రంపై బాబుది ఆవేద‌నా? ఆక్రోశ‌మా..?

Update: 2016-05-18 04:41 GMT
ప్ర‌త్యేక హోదా మీద ప్ర‌ధాని మోడీని నిల‌దీసినంత ప‌ని చేయ‌కున్నా.. గ‌తంతో పోలిస్తే.. కాస్త గ‌ట్టిగానే ఆ విష‌యం మీద మాట్లాడాల‌న్న ఆలోచ‌న‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉన్నార‌న్న భావ‌న స‌ర్వ‌త్రా వినిపించింది. దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న త‌న ప్ర‌య‌త్నాలు చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అనుకున్న రోజు రానే వ‌చ్చింది. బెజ‌వాడ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కిన బాబు.. ఎయిర్ పోర్ట్ నుంచి మ‌రే ప‌ని లేద‌న్న విష‌యాన్ని తేల్చి చెబుతూ ప్ర‌ధాని వ‌ద్ద‌కు వెళ్లారు. గంట‌న్న‌ర సేపు ప్ర‌ధాని మోడీతో భేటీ అయిన ఆయ‌న‌.. 20నిమిషాల పాటు మోడీతో ప్ర‌త్యేకంగా భేటీ అయిన‌ట్లుగా చెబుతున్నారు. అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చాక ఎవ‌రూ మోడీతో భేటీ గురించి మాట్లాడింది లేదు.

క‌ట్ చేస్తే.. సాయంత్రం బాబు మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌త్యేక హోదా అంశాన్ని తీసుకొచ్చిన ఆయ‌న త‌న ఆవేద‌న‌ను ఆక్రోశంగా మీడియా ఎదుట చెప్పిన వైనం చూస్తే.. ప్ర‌ధానితో ప్ర‌త్యేక హోదా మీద జ‌రిగిన సంభాష‌ణ ఏ తీరులో సాగిందో అర్థం చేసుకోవ‌టానికి పెద్ద స‌మ‌యం ప‌ట్ట‌దు. ఇప్ప‌టికే క‌మ‌ల‌నాథులు క‌రాఖండిగా చెప్పిన‌ట్లే.. మోడీ కూడా ప్ర‌త్యేక హోదా లాంటివి జాన్తా నై అని చెప్పేసి ఉంటారు. లేకుంటే.. బాబు నోటి నుంచి ఎప్పుడూ రాని చాలామాట‌లు వ‌చ్చేశాయి.

గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఐదేళ్లు ఇస్తామ‌ని ఏపీకి హామీ ఇచ్చార‌ని.. కాదు ప‌దేళ్లు ఇస్తామ‌ని బీజేపీ నేత‌లు కోరార‌ని.. మోడీ సైతం  తిరుప‌తి స‌మావేశంలో ప్ర‌త్యేక హోదా మాట‌ను చెప్పారంటూ గ‌తాన్ని గుర్తు చేశారు. ఇక్క‌డే ఓ కీల‌క వ్యాఖ్య చేశారు. ఏపీకి ఇచ్చిన హామీకి దేశం మొత్తానికి బాధ్య‌త ఉంద‌ని.. ఇది ఒక్క బీజేపీనే కాదు.. అన్ని పార్టీల‌ను తాను అడుగుతున్న‌ట్లుగా చెప్పుకొచ్చారు. ఈ ఒక్క మాట చాలు.. ప్ర‌త్యేక హోదా అంశం మీద మోడీ నుంచి వ‌చ్చిన స‌మాధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చ‌నే చెప్పాలి.

మోడీతో బేటీ సంద‌ర్భంగా నిధుల మీద దృష్టి పెట్ట‌లేద‌ని.. మీటింగ్ ఇచ్చిన స్ఫూర్తి ముఖ్యమ‌ని బాబు చెప్పుకొచ్చారు.  విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఇరిగేష‌న్ ప్రాజెక్టుల విష‌యం మీద రెండురాష్ట్రాల‌కు ఉన్న స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త కేంద్రానికి ఉంద‌ని..కానీ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌న్న బాబు.. కాంగ్రెస్ చేసిన త‌ప్పుల‌కు ఏపీ ప్ర‌జ‌ల‌కు శిక్షలు వేయ‌టం స‌రికాదని వ్యాఖ్యానించారు. ఏపీకి రెవెన్యూ లోటు పెద్ద స‌మ‌స్య అని..14వ ఆర్థిక సంఘం సిఫార్సుచేసిన త‌ర్వాత కూడా ఏపీకి లోటు ఉంటుంద‌ని.. రెండేళ్ల‌లో కొన్ని ప‌నులే జ‌రిగాయ‌ని.. జ‌ర‌గాల్సిన‌వి చాలానే ఉన్న‌ట్లు చెప్పిన మోడీ.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మోడీ భేటీ త‌ర్వాత బాబు మాట‌ల్ని చూస్తే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యం మీద ప్ర‌ధాని విష‌యం తేల్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. లేదంటే.. బాబు నోటి నుంచి ఈ త‌ర‌హా మాట‌లు వ‌చ్చే అవ‌కాశ‌మే ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News