తమ్ముళ్ళ మీద ఒట్టు : ఆ విషయంలో బాబు ఫుల్ స్ట్రిక్ట్...?

Update: 2022-06-18 02:30 GMT
చంద్రబాబుకు ఇదేమీ కొత్త కాదు, ఆ మాటకు వస్తే ఆయనది నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయం. ఆయన ఇలాంటివి ఎన్ని చూసుకుంటారు. ఇక ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో మూడుసార్లు విపక్ష నేతగా కూడా బాధ్యతలు నిర్వహించారు. సీఎంగా బాబు ఉంటే ఆయనను కలిసేందుకు మంత్రులకు కూడా వీలు చిక్కదు. ఇక ఆయన కార్యకర్తలను పట్టించుకోరు అన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

బాబు ఎంతసేపూ కార్పోరేట్ తరహాలోనే పార్టీని నడిపారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే బాబు మాత్రం ఈసారి అలా కాదు అని అంటున్నారు. 2004 నుంది 2014 వరకూ పదేళ్ల పాటు బాబు ప్రతిపక్షంలో ఉన్నపుడూ ఇవే మాటలు చెప్పారు. కానీ జరిగినది ఏమిటి అన్నది చూస్తే 2014 నుంచి 2019 వరకూ బాబు చుట్టూ మళ్లీ వ్యాపారవేత్తలు, బడా బాబులు, పెద్దలూ చేరిపోయారు. తమ పని చేయించుకున్నారు. పార్టీని అధికారాన్ని తమ కోసం వాడుకున్నారు.

వారిలో కొందరు రాజ్యసభ మెట్లెక్కారు కూడా. కొందరు మంత్రులు అయ్యారు. కొందరు కీలక పదవులలో కొలువు తీరారు. 2019లో పార్టీ పరాజయం పాలు అయి పాతికకు రెండు తక్కువకు సీట్లు వస్తే బాబు చుట్టూ వారంతా లేరు. మళ్లీ బాబు పార్టీని లేపడానికి గ్రౌండ్ లెవెల్ నుంచి జెండాను రెపరెపలాడించడానికి ఏడు పదుల ముదిమి వయసులో రోడ్డు మీదకు వచ్చారు. ఇంతకు ముందు అయినా ఇపుడు అయినా టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే ఆ రెక్కల కష్టం అంతా చంద్రబాబుదే.'

ఆయన సంకల్పబలానికి తమ చిత్తశుద్ధి జోడించి తలో చేయి వేసి కసితో పనిచేసిన కార్యకర్తలదే. కానీ అధికారంలోకి వస్తే చాలు బాబు మారిపోతున్నారు అని క్యాడరే అంటోంది. ఆయన చుట్టూ అడ్డుగోడలా కొన్ని శక్తులు చేరిపోతున్నాయి అని వాపోతున్నారు. ఇక గత పాలనలో చాలా చోట్ల కనీసం నామినేటెడ్ పదవులు కూడా క్యాడర్ కి దక్కలేదు అంటే అది పూర్తిగా అధినాయకత్వం తప్పే.

అందుకే ఈసారి అలాంటి తప్పులు చేయనని బాబు ఒట్టు పెట్టుకున్నారు. తమ్ముళ్ల సాక్షిగా చెబుతున్నా నేను మారిపోయాను అని అంటున్నారు. మీరే పార్టీకి జీవనాడి అని కూడా కార్యకర్తలను చూసి ఆయన అంటున్న మాటలు. మీరు లేకపోతే పార్టీ లేదు. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా పెద్ద పీట మీకే అని బాబు చెబుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా టూర్లో బాబు మనసు విప్పి మాట్లాడారు.

ఒకింత ఆయన బాధతో కూడా మాట్లాడారు అనిపించింది. పార్టీకి కష్టపడేది క్యాడర్. వారి నిజాయతీకి కొలమానం లేదు, ఏళ్లకు ఏళ్ళుగా పార్టీ పట్ల అభిమానంతో వారు కష్టపడుతూంటే సరైన న్యాయం చేయలేకపోయామని కూడా బాబు గ్రహించారు. ఈసారి అలాంటి పొరపాట్లు రావు, కష్టించి పనిచేసిన వారికే అందలాలు. నన్ను నమ్మండి అని బాబు గట్టిగానే చెబుతున్నారు. తమ్ముళ్ళు కూడా బాబుని అర్ధం చేసుకున్నారు. కేవలం బాబు కోసమే వారు జెండా బట్టి వీధుల్లోకి ఈసారి వచ్చారు అన్నది నిజం.

ఇక నిజంగా ఆలోచిస్తే పార్టీ అధికారంలోకి రావాలని బాబుకూ క్యాడర్ కి మాత్రమే గట్టిగా పట్టుదల ఉంది. మరి మధ్యలో ఉన్న వారు పవర్ లోకి వస్తే ఫలితాలు కొట్టేసే కల్చర్ పోవాలి. ఆ విషయంలో ఫుల్ స్ట్రిక్ట్ అని బాబు చెబుతున్నారు. అదే జరిగితే టీడీపీ కార్యకర్త దశ తిరిగినట్లే. ఇక టీడీపీ కూడా అసలు వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు. ఎందుకంటే ఏ పార్టీకైనా క్యాడరే ముఖ్యం. వారు కనిపించే దేవుళ్ళు. వారి ఆదరణ ఉంటే పార్టీ పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది. మొత్తానికి బాబు లోపాలను గుర్తించారు. రిపేర్లు చేస్తున్నారు. ఇక జనాలు దీవిస్తే కచ్చితంగా టీడీపీదే అధికారం అని చెప్పవచ్చు.
Tags:    

Similar News