బాబు జాతకాన్ని మార్చేది అదేనట... ?

Update: 2021-08-12 16:30 GMT
ఏపీలో టీడీపీ బలం ఎక్కడ ఉంది అంటే గట్టిగా చెప్పాలి అంటే పదమూడు జిల్లాలో ఆరేడు జిల్లాల్లో మాత్రమే. 2014 లెక్కలు చూసుకున్నా అదే విషయం అర్ధం అవుతుంది. ఉత్తరాంధ్రా, గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా గుంటూరు జిల్లాలు టీడీపీకి పొలిటికల్ గా టర్నింగ్ పాయింట్స్ గా ఉంటాయి. ఈ ఏడు జిల్లాలలో మొత్తం సీట్లు కలుపుకుని 101 సీట్లు ఉంటాయి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొంత అవకాశం ఉంటే రాయలసీమలో అనంతపురం తప్ప మిగిలిన చోట్ల పెద్దగా టీడీపీకి బలం లేదు అన్నది రాజకీయ గణాంకాలు తేల్చిన నిజం. ఆందువల్ల టీడీపీ మళ్ళీ గద్దెనెక్కాలి అంటే కచ్చితంగా ఈ 101 జిల్లాల్లో బలం పుంజుకోవాల్సిందే.

ఇందులో ఉత్తరాంధ్రలోని 34 సీట్లు 2019 ఎన్నికల్లో టీడీపీకి గట్టిగా దక్కింది ఆరు మాత్రమే. అంటే 28 సీట్లను వైసీపీకి కోల్పోయింది. అంతకు ముందు 2014 ఎన్నికల్లో 25 సీట్లు టీడీపీ గెలుచుకుంది కాబట్టే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారు. దాంతో ఉత్తరాంధ్రాలో పట్టు కోసం టీడీపీ కసరత్తు చేస్తోంది. విషయం ఏంటి అంటే టీడీపీకి ఈ జిల్లాల్లో మంచి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. కానీ వారంతా కూడా ఇపుడు పూర్తిగా డల్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది అన్న నమ్మకం అయితే ఈ రోజుకీ వారికి కలగడంలేదు. ఏపీలో రాజకీయ సంచలనం చోటు చేసుకుంటే తప్ప టీడీపీ శ్రేణులు మొద్దు నిద్ర వీడి మేలుకునే అవకాశాలు అయితే లేవు.

దాంతో టీడీపీకి 101లో ఈ 34 సీట్లు ఇప్పటికైతే మెజార్టీ మైనస్ గా ఉన్నాయనే అంటున్నారు. ఇక గోదావరి జిల్లాలలో కూడా మరో 34 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా గత ఎన్నికలల్లో టీడీపీ గెలుచుకున్నది ఆరు సీట్లే. అందులో తూర్పుగోదావరిలోనే అయిదు సీట్లు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే మొత్తం 68 సీట్లకు గానూ టీడీపీ 12 సీట్లను గెలుచుకుని 56 సీట్లు వైసీపీకి వదిలిపెట్టేసింది. దీంతో ఈసారి ఎన్నికల్లో సగానికి పైగా సీట్లు ఈ అయిదు జిల్లాలలో గెలుచుకుంటేనే టీడీపీకి మెజారిటీ లభించడం జరుగుతుంది. ఇక్కడ కనుక గేర్ మారిస్తేనే కృష్ణా - గుంటూర్ ఫేస్ టర్నింగు ఇచ్చుకున్నా కూడా గెలుపు సాధ్యపడుతుంది.

ఇక కృష్ణా , గుంటూరులలో చూసుకుంటే 33 సీట్లు ఉన్నాయి. ఇందులో ఈసారి అమరావతి రాజధాని ఉద్యమం వల్ల పాతిక సీట్లు టీడీపీ గెలుచుకున్నా ఈ అయిదు జిల్లాలలో కనీసం యాభై సీట్లు తెచుకుంటే మిగిలిన ఆరు జిల్లాల్లో పాతిక వచ్చినా అపుడు బొటాబొటీ మెజారిటీతో ఏపీ పీఠం చంద్రబాబు వశం అవుతుంది. దాంతో చంద్రబాబు చూపు అంతా ఉత్తరాంధ్రా గోదావరి జిల్లాల మీదనే ఉందిట.


Tags:    

Similar News