యూటర్న్ తీసుకున్న చంద్రబాబు

Update: 2021-11-23 11:30 GMT
ఏ విషయంలో అయినా యూ టర్నులు తీసుకోవడం చంద్రబాబునాయుడుకు బాగా అలవాటే. తాను అధికారంలో ఉండగా ప్రత్యేక హోదాపైనా ఎన్ని పిల్లి మొగ్గలు వేశారో అందరూ చూసిందే. హోదా అంశంలో కేంద్రంపై ఒత్తిడి తేవటానికి ఎంపీలందరూ రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చేసిన ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించారు.

అయితే ఆ తర్వాత తమ ఎంపీలతో రాజీనామా చేయించే విషయంలో యూటర్న్ తీసుకున్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామాలు చేయలేదు.

ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలపైనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ఇపుడు ఇదంతా ఎందుకంటే ఇపుడు కూడా మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అండ్ కో ఎంఎల్ఏలు అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ఆ విషయమై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీని బహిష్కరించిన ఎంఎల్ఏలు జీత, బత్యాలు ఎలా తీసుకుంటారని నిలదీశారు.

జనాలు వీళ్ళని ఎంఎల్ఏలుగా గెలిపించి సమస్యలను పరిష్కరించమని చెబితే వైసీపీ ఎంఎల్ఏలు అసెంబ్లీని బహిష్కరించటం ఏమిటంటూ సెటైర్లు వేశారు. ఎంఎల్ఏలకు జీతాలు ఎందుకివ్వాలి ? బత్యాలు ఎలా తీసుకుంటారు ? ప్రోటోకాల్ ఎందుకు పాటించాలంటు గట్టిగానే తన వాదనను వినిపించారు.

సీన్ కట్ చేస్తే మరిపుడు చంద్రబాబు చేసిందేమిటి ? తాను అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రిగా మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెడతానని శపథం చేశారు.

అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసిందే ఇపుడు చంద్రబాబు చేశారు. అంటే అసెంబ్లీని బహిష్కరించిన విషయంలో కూడా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నట్లు అర్ధమైపోతోంది.

అప్పట్లో వాళ్ళకు జీతాలు, భత్యాలు ఎందుకివ్వాలని అడిగిన చంద్రబాబు ఇపుడు వాటన్నింటినీ వదులుకుంటారా ? అప్పట్లో వైసీపీ ఎంఎల్ఏలను చంద్రబాబు ఏవైతే అడిగారో అవన్నీ ఇపుడు తనకు కూడా వర్తిస్తుంది. ముందు ముందు చంద్రబాబు ఇంకెన్ని యూటర్నులు తీసుకుంటారో చూడాలి.


Tags:    

Similar News