అమరావతి కాడి దింపేసిన చంద్రబాబు

Update: 2020-12-06 12:30 GMT
జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజదానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని గ్రామాల జనాలు 350 రోజులుగా ఉద్యమం ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంతంలోని జనాలను, రైతులను బాగా రెచ్చగొట్టి ఉద్యమంలోకి దింపింది చంద్రబాబునాయుడే. జగన్ మీదున్న కోపంతో స్ధానికులను రెచ్చగొట్టడానికి మొదట్లో స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగారు. తాను దిగారు కాబట్టి అనివార్యంగా టీడీపీ నేతలు, లోకేష్ లాంటి వాళ్ళంతా రాజధాని గ్రామాల్లో తిరిగారు.

స్వయంగా చంద్రబాబే గ్రామాల్లోకి రావటంతో టీడీపీ మద్దతుదారులు, సానుభూతిపరులు రెచ్చిపోయారు. రాజధాని తమ ప్రాంతంనుండి తరలిపోతుందనే ఆందోళనున్న మరికొందరు కూడా వీళ్ళకు తోడయ్యారు.  మొత్తానికి జగన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతోందనే కలరింగ్ అయితే రాష్ట్రంలో ఇవ్వగలిగారు. అయితే తర్వాత కొద్ది రోజులకు కరోనా వైరస్ మహమ్మారి మొదలవ్వటంతో ఆందోళన కాస్త చప్పపడిపోయింది. దాంతో చంద్రబాబు ఆందోళన శిబిరాల వైపు వెళ్ళటం మానేశారు. ఎప్పుడైతే చంద్రబాబు పట్టించుకోవటం లేదని అర్ధమైందో నేతలు కూడా వెళ్ళలేదు.

ఆందోళనకు 100 రోజులని, 200 రోజులని చెప్పుకుంటూ చివరకు 350 రోజులకు చేరుకుంది. ఆందోళనకారులతో మాట్లాడుదామని మధ్యలో మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, బొత్సా సత్యనారాయణ లాంటి వాళ్ళు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. దాంతో రైతులతో చర్చించాలనే ప్రయత్నాలు  ప్రభుత్వం నుండి ఆగిపోయింది. గట్టిగా చెప్పాలంటే ప్రభుత్వంలోని పెద్దలెవరు అసలు ఆందోళనగురించి ఆలోచించటమే లేదు. ఈ నేపధ్యంలోనే ఐదురోజుల అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగాయి.

ఈ సమావేశాల్లో చంద్రబాబు మొహమాటానికి కూడా అమారవతి రైతుల ఆందోళన విషయాన్ని ప్రస్తావించలేదు. మీడియా సమావేశాల్లో ఈ విషయాన్ని మాట్లాడటం ఎప్పుడో మానేశారు. ఐదురోజుల సమావేశాల్లో అనేక అంశాలపై గోల గోల చేసిన చంద్రబాబు మరి అమరావతి గ్రామాల్లో జరుగుతున్న  ఆందోళనలను ఎందుకు ప్రస్తావించలేదు ? అసెంబ్లీ వేదికగా అమరావతి అంశంపై ప్రస్తావించాలని కనీసం బీఏసీ సమావేశంలో కూడా టీడీపీ ప్రతిపాదించలేదు.

ఈ విషయంలోనే చంద్రబాబు వైఖరి పైన అమరావతి గ్రామాల్లో వ్యతిరేకత మొదలైందని సమాచారం. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు వెంటనే అమరావతి గ్రామాలను సందర్శించారు. అమరావతి ఉద్యమం ప్రపంచం ఉద్యమాల్లో చిరస్ధాయిగా నిలిచిపోతుందంటు వాళ్ళకు బిస్కెట్ వేసే ప్రయత్నాలు చేశారు. ప్రపంచంలో ఎక్కడ ఉద్యమం చేయాలన్నా వాళ్ళకు అమరావతి ఉద్యమమే స్పూర్తిగా నిలుస్తుందంటూ వాళ్ళని జో కొట్టే ప్రయత్నంచేశారు. మరి చంద్రబాబు చేసిన తాజా ప్రయత్నాలు ఏమేరకు ఫలితం ఇచ్చింది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
Tags:    

Similar News