ఎన్నాళ్లకు 'నిజం' గుర్తించావ్ చంద్రబాబు

Update: 2015-08-19 03:58 GMT
గుంభనంగా ఉంటూ.. పెద్దగా ఓపెన్ కాని ఏపీ ముఖ్యమంత్రి ఒక కీలక అంశం గురించి నోరు విప్పారు. అధినేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు కంచుకోటలా ఉంటాయి. నిజానికి.. వారు తమ నియోజకవర్గాలను పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే.. తాను వెళ్లినా.. వెళ్లకున్నా విజయం పక్కానే కాదు.. భారీ మెజార్టీని అక్కడి ప్రజలు కట్టబెడతారన్న ధీమా కూడా.

మిగిలిన నియోజకవర్గాల్లో  ఇలాంటి పరిస్థితి ఉంటేందేమో కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ ఇబ్బందే. బాబు గెలవటం పక్కా అయినప్పటికీ.. విజయం కోసం మాత్రం చెమటలు చిందించాల్సిందే. వ్యూహాలు నడపాల్సిందే. గెలుపు ధీమా ఓ పక్క ఉన్నా.. అనూహ్య పరిణామాలకు అవకాశం ఉందేమోనన్న గుబులు ఎప్పుడూ వ్యక్తమవుతూ ఉంటుంది.

ఈ విషయం తెలిసినా తెలియనట్లు ఉంటారో.. లేక నిజంగా తెలీదన్నట్లు ఉండే చంద్రబాబు.. తాజాగా మాత్రం ఆ విషయం తాను తెలుసున్న విషయాన్ని తన మాటలతో చెప్పేశారు. ఇందుకు పక్క పొరుగునే ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలలితతో పోల్చుకున్నారు. ఇల్లు వదిలిపెట్టి బయటకు రాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. ఎమ్మెల్యే గా పోటీ చేస్తే ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా ఓటర్లు గెలిపిస్తున్నారని.. తాను అనుక్షణం కప్పం గురించి ఆలోచిస్తూ.. ఇక్కడి అభివృద్ధి కోసం శ్రమిస్తుంటే.. ఆశించినంత మెజార్టీ రాకపోవటమేమిటంటూ నేతల్ని ప్రశ్నించారు.

కుప్పంలో ఏర్పాటు చేసిన టీడీపీ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతల పని తీరు పట్ల ఆవేదన.. అగ్రహాన్ని కలిపి ప్రదర్శించిన చంద్రబాబు.. నియోజకవర్గంలో తాము లేకుంటే ఏమీ జరగదన్న అహంతో వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ క్యాడర్ ను పట్టించుకోకుండా ఉంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించిన ఆయన..నియోజకవర్గంలోని సమస్యలతో తాను ఏకీభవిస్తున్నట్లుగా పేర్కొన్నారు. నిజానికి ఇలాంటి పరిస్థితి ఎప్పటి నుంచో ఉన్నా.. బాబుకు మాత్రం ఇప్పుడే గుర్తుకు రావటం గమనార్హం.
Tags:    

Similar News