నెల్లూరు వైసీపీలో లుక‌లుక‌లు.. ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పు ఉంటుందా?

Update: 2021-08-09 05:30 GMT
నెల్లూరు జిల్లా వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇక్క‌డి అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మందిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో మారుస్తార‌ని.. కొంద‌రికి టికెట్లు కూడా ఇవ్వ‌ర‌ని.. మ‌రికొంద‌రికి స్థాన చ‌ల‌నం క‌ల్పించి.. వేరే నియోజ‌క‌వ‌ర్గాల్లో అవ‌కాశం ఇవ్వ‌నున్నార‌ని.. వైసీపీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దీంతో ఎవ‌రిని మారుస్తారు? ఎందుకు మారుస్తారు? అనే విష‌యాల‌పై పొలిటిక‌ల్‌గా ఆస‌క్తి రేగింది. విష‌యంలోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌. నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్‌రెడ్డి, నేదురుమ‌ల్లి రాజ్య‌ల‌క్ష్మి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, వివేకానంద‌రెడ్డి, మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి వంటి ఉద్దండులు ఇక్క‌డ కాంగ్రెస్‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఏర్పాటు చేశారు.

అదేస‌మ‌యంలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ కూడా పుంజుకుంది. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత‌లు చాలా మంది రాజ‌కీయాల‌కు దూరం కాగా.. మేక‌పాటి వంటివారు వైసీపీకి అండ‌గా నిలిచారు. దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. వైసీపీకి అనుకూలంగా మారిపోయింది. దీంతో 2014 ఎన్నిక‌ల్లో చాలా వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది, ఇక‌, 2019లో మొత్తం గుండుగుత్తుగా ఇక్క‌డ వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ క్ర‌మంలోనే జిల్లాకు చెందిన మేక‌పాటి గౌతం రెడ్డిని, అనిల్‌కుమార్ యాద‌వ్‌ను జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గంలో చేర్చుకున్నారు. కానీ, అనేక మంది రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు త‌మ‌కు గుర్తింపు లేకుండా పోయింద‌నే ఆవేద‌న‌లో ఉన్నారు.

మ‌రోవైపు కొంద‌రు ప‌ద‌వులు ద‌క్క‌క‌పోయినా.. త‌న ప్రాభ‌వం త‌గ్గ‌కుండా చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆధిప‌త్య రాజకీయాలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వాటిలో గూడూరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇది ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఐఏఎస్ అధికారి వెల‌గ‌పూడి వ‌ర‌ప్ర‌సాద్‌కు జ‌గ‌న్ టికెట్ ఇచ్చారు. ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న త‌న సొంత బ‌లంతోనే విజ‌యం ద‌క్కించుకున్నాన‌నే ధీమా వ్య‌క్తం చేస్తూ.. కింది నేత‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో ఇక్క‌డ గ‌తంలో గెలిచిన పాశం సునీల్ కూమార్ చాలా బెట‌ర్ అని.. ఇప్పుడు టీడీపీలో ఉన్న సునీల్‌నే తిరిగి వైసీపీలోకి తీసుకువ‌చ్చి టిక్కెట్ ఇప్పించుకోవాల‌ని వైసీపీ నేత‌లు చూస్తున్నారు.

ఇక కావలిలో వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డి కూడా ఆధిప‌త్య ధోర‌ణినే ప్ర‌ద‌ర్శిస్తున్నారు.  కొన్ని వ‌ర్గాల‌ను దూరం పెట్ట‌డంతో పాటు వైసీపీ కీల‌క నేత‌లుగా ఉన్న వారిని కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డానికి వీల్లేద‌ని అంటున్నారు. దీంతో ఆయా వ‌ర్గాలు ఆయ‌న‌పై ఆగ్ర‌హంతో ఉన్నాయి. ఈ ప‌రిణామాల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. ఓడించితీరుతామంటూ.. కొంద‌రు నేత‌లు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.  ఇక ఆత్మ‌కూరు నియోజ‌వ‌క‌ర్గం విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ నుంచి మేక‌పాటి కుమారుడు గౌతంరెడ్డి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుని మంత్రిగా కూడా ఉన్నారు.

అయితే.. మిగిలిన నేత‌ల మాదిరిగాఈయ‌న వివాదం కాక‌పోయినా.. త‌ట‌స్థంగా ఉండ‌డ‌మే ఇప్పుడు ఈయ‌న‌కు ప్ర‌మాదంగా మారింది. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉండ‌డం.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిలో మంత్రిగా త‌న మార్కు చూపించ‌క‌పోవ‌డం, ముఖ్యంగా మంత్రి అయిన‌ప్ప‌టికీ.. నేత‌ల‌తో స‌ఖ్య‌త లేక పోవ‌డం.. చిన్న‌పాటి వివాదాల‌ను కూడా ప‌రిష్క‌రించేందుకు సాహ‌సం చేయ‌లేక పోవ‌డం వంటివి  గౌతం రెడ్డికి మైన‌స్‌గా మారాయి. దీంతో ఆయ‌న‌ను ఇక్క‌డ నుంచి మార్చాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలా వైసీపీ నేత‌లు.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తున్నారు. దీనిని అధిష్టానం దృష్లికి కూడా త్వ‌ర‌లోనే తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News