ఏపీ సచివాలయంలో మార్పులు...వాస్తు దోషమా? భద్రతా కారణాలా?

Update: 2020-09-09 11:10 GMT
చాలామంది రాజకీయ నాయకులకు వాస్తుపై గట్టి నమ్మకం ఉంటుంది. నామినేషన్ వేయడం మొదలు తమ కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టే వరకు అన్నీ వాస్తు ప్రకారం జరగాల్సిందే. తేదీ, తిధి, రోజు, వారం, వజ్యం, సమయం...ఇలా అన్నీ సవ్యంగా ఉంటేగానీ కొందరు నేతలు అడుగు బయటపెట్టరు. తెలంగాణ సీఎం కేసీఆర్ వాస్తును బలంగా నమ్ముతారని, వాస్తు దోషం కారణంగానే తెలంగాణలోని పాత సచివాలయాన్ని కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన కూల్చివేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇపుడు తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనే ఏపీ సీఎం జగన్ కూడా పయనిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీ సచివాలయంలోనూ వాస్తు దోషం వల్లే కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏపీ సెక్రటేరియట్, అసెంబ్లీ గేట్లలోని కొన్నింటికి హఠాత్తుగా గోడలు అడ్డంగా కట్టించడం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది. సెక్రటేరియట్ గేట్ 1, అసెంబ్లీ గేట్ 2లను మూసివేస్తూ గోడ కట్టిస్తున్నారు అధికారులు. అయితే, భద్రతా కారణాల రీత్యా ఆ గేట్లు క్లోజ్ చేస్తున్నామని వారు అంటున్నారు.

ఇలా గేట్లు మూయడం ఇది రెండోసారి. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీ గేట్ నంబర్ 5, సెక్రటేరియట్ ఉత్తర, దక్షిణ గేట్‌లను అధికారులు గోడతో మూసి వేయించారు. మాజీ సీఎం చంద్రబాబు రాకపోకలు సాగించే మార్గాన్ని కూడా గతంలోనే అధికారులు మార్చివేశారు. సీఎం జగన్ పాలనా పగ్గాలు అందుకున్న తర్వాత అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్, అసెంబ్లీల్లో పలు మార్పులు చేర్పులు జరిగాయి. తన ఆఫీసులోనూ జగన్ కొన్ని మార్పులు చేయించారు. సీఎం సీటు వెనుక పద్మంలాంటి ఆకారం బదులు ఆంధ్రప్రదేశ్ చిహ్నం ఏర్పాటు చేయించారు జగన్. అయితే, వాస్తు సెంటిమెంట్ తోనే జగన్ ఇలా మార్పులు చేర్పులు చేయించారని ప్రచారం జరుగుతోంది. అమరావతి నుంచి పాలించిన బాబు నేతృత్వంలోని టీడీపీ...2019 ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో ఓటమి పాలైైంది. అందుకే, జగన్ ముందు జాగ్రత్తగా వాస్తుపరమైన మార్పులు చేస్తున్నారన్న టాక్ వస్తోంది. మరి, వాస్తు మార్పు ప్రచారంలో నిజానిజాలెంత అన్నది తెలియాల్సి ఉంది. మరి, ఆ ప్రచారం ఒక వేళ నిజమైతే...జగన్ కు ఈ మార్పులు చేర్పులు ఎంతవరకు కలిసొస్తాయన్నది వేచి చూడాలి.
Tags:    

Similar News