చైనాకు చెక్ : అరుణాచల్ సరిహద్దుల్లో భారత్ ఆర్మీ యుద్ధ సన్నాహకాలు

Update: 2021-10-21 09:31 GMT
అరుణాచల్ ప్రదేశ్‌ లో, తూర్పు లడఖ్ లాగా వ్యవహరించడానికి చైనాకు అవకాశం ఇవ్వకుండా సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సైన్యాన్ని ముందుకు తీసుకురావడానికి అరుణాచల్ సెక్టార్‌ లోని 1350 కిలోమీటర్ల పొడవైన వాస్తవ నియంత్రణ రేఖ   వెంట రోడ్లు.. సొరంగాల నెట్‌వర్క్ శరవేగంగా ఏర్పాటు చేశారు. దీనితో పాటు, డ్రోన్ విమానాలు, ఇజ్రాయెల్ నుండి అందుకున్న ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా కూడా హైటెక్ నిఘా సిద్ధం అయింది. ఇది సరిహద్దుల్లో ప్రతి చిన్న కదలిక గురించి తక్షణ సమాచారాన్ని అందిస్తుంది.

భారత సరిహద్దు భద్రతా జవాన్లు సమర్థవంతంగా అడ్డుకోవడంతో వెనక్కి తగ్గింది. ఆ తరువాత అరుణాచల్ ప్రదేశ్‌ ను టార్గెట్‌ గా చేసుకుంది. ఈ ఈశాన్య రాష్ట్రానికి అత్యంత సమీపంలో.. తన దేశ భూభాగంపై చైనా ఓ గ్రామాన్నే నిర్మించింది యుద్ధ ప్రాతిపదికన. కొద్దిరోజుల కిందటే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు.. భారత సరిహద్దు భద్రతా జవాన్లపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. సరిహద్దులను దాటుకుని రావడానికి ప్రయత్నించారు. చైనా సైనికుల ఆక్రమణ ప్రయత్నాలను భారత జవాన్లు తిప్పి కొట్టారు. వారిని సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఫలితంగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దానికి అనుగుణంగా చైనా తన దందుడుకు చర్యలను మరింత ముమ్మరం చేసింది.

సైన్యం సంఖ్యను పెంచే ప్రయత్నాలు చేస్తోంది. కొద్దిరోజుల కిందటే ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అరుణాచల్ ప్రదేశ్‌ లో నిర్వహించిన పర్యటనను కూడా చైనా తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ పరిణమాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తోన్న భారత ఆర్మీ అధికారులు.. డ్రాగన్ కంట్రీ ముఖం పగిలే సమాధానం ఇవ్వడానికి సమాయాత్తం అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద జవాన్ల గస్తీని మరింత పెంచారు. ఆయుధ సంపత్తిని అక్కడికి తరలించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి తాము సర్వ సన్నద్ధులమై ఉన్నామనే సంకేతాన్ని చైనాకు పంపించారు. చైనా దూకుడుకు కళ్లెం వేసేలా ఆర్మీ అధికారులు తక్షణ చర్యలను తీసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని కేంద్రం స్పష్టం చేసింది.

 ఇందులో భాగంగా- తవాంగ్ సెక్టార్‌ లో సరిహద్దు భద్రతా జవాన్లు వార్ డ్రిల్‌ను మొదలు పెట్టారు. భౌగోళికంగా రెండు దేశాలకు కూడా అత్యంత కీలకమైన సెక్టార్ ఇది. అరుణాచల్ ప్రదేశ్‌ కు ఈశాన్య దిక్కున ఉంటుందీ తవాంగ్ సెక్టార్. ఇక్కడికి కూత వేటు దూరంలో ఉన్న భారత్-చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఈ యుద్ధ సన్నాహకాలను చేపట్టింది. వార్ డ్రిల్‌ ను కొనసాగిస్తోంది. యుద్ధంలో శత‌ృసైన్యాన్ని ఎలా తుదముట్టించాలనే విషయంపై దీన్ని నిర్వహిస్తున్నామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. మిలటరీ ఎక్సర్‌ సైజ్‌ గా దీన్ని భావిస్తున్నామని చెప్పారు. భారత్ చేపట్టిన వార్ డ్రిల్‌ పై చైనా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తవాంగ్ సెక్టార్‌ లో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి ఎప్పటికిప్పుడు అధికారులు ఆరా తీస్తున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. భారత్ ఈ వార్ డ్రిల్‌ ను చేపట్టడం పట్ల కొంత అసహనం, అసంతృప్తి వ్యక్తమౌతున్నట్లు అంచనా వేసింది.
Tags:    

Similar News