తిరుపతి మీద వాళ్ల కన్ను పడిందా?

Update: 2015-12-12 05:23 GMT
కొన్ని సందర్భాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాంటిదే.. ఈ మధ్యన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది. తీవ్రస్థాయిలో కురిసిన వర్షాలతో.. భారీగా పోటెత్తిన వరదల కారణంగా చెన్నై మహానగరం అతలాకుతలం అయ్యింది. ఈ వరదల కారణంగా.. లక్షలాది ప్రజలతో పాటు.. కొన్ని రంగాల కంపెనీలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. అలాంటి వాటిలో చెన్నై ఐటీ పరిశ్రమ ఒకటి. అనుకోని ఘటనలు చోటు చేసుకున్నప్పుడు.. వాటికి సంబంధించి భవిష్యత్తులో ఏం జరుగుతుంది? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? లాంటి ప్రశ్నలు ఎదురవుతుంటాయి.

అలాంటి వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో ఉన్న చెన్నై ఐటీ పరిశ్రమ ఇప్పుడు బిజీగా ఉంది. మరోవైపు..  భారీ వర్షాలు.. వరదల కారణంగా చెన్నైలోని ఐటీ రంగం దాదాపుగా రూ.5వేల కోట్లకు పైనే నష్టం వాటిల్లిందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వరదల కారణంగా చెన్నై ఐటీ కారిడార్ లో నీట మునిగిన కంప్యూటర్లు.. సర్వర్లతో.. జరిగిన నష్టంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు.. భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశంపై దృష్టి సారిస్తున్నాయి. దీనికి పరిష్కారంగా తిరుపతి నగరం మీద ఐటీ రంగం దృష్టి పడుతోంది. చెన్నై.. బెంగళూరు మహానగరాలకు సమీపంలో ఉన్న తిరుపతి నగరం అయితే.. విపత్తులకు దూరంగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది.

దీనికి తోడు.. ఈ నగరానికి సమీపంలోనే విమానాశ్రయం ఉండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. మహానగరం కానప్పటికీ.. అలా మరేందుకు అవకాశం ఉన్న తిరుపతి.. ఇప్పటికే అధ్యాత్మిక రాజధానిగా పేరుంది. ఇక్కడున్న వసతులు.. పరిస్థితులు ఐటీ రంగానికి ఎంతో అనువుగా ఉంటాయన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే పలు కంపెనీలు తిరుపతిలో సంస్థల్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై దృష్టి సారించాయని చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరుస్తూ.. హెచ్ సీఎల్.. టీసీఎస్ కంపెనీలు తిరుపతిలో కార్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ ఇదే నిజమైతే.. ఏపీకి ఈ పరిణామం అనుకోని వరంగా మారే అవకాశం ఉంది. విభజన నేపథ్యంలో తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల విషయంలో రాయితీలు కల్పించేందుకు ఏపీ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో.. చెన్నైకి ప్రత్యామ్నాయం తిరుపతి సరైన ప్రాంతంగా భావించే ఐటీ పరిశ్రమలను అక్కున చేర్చుకునే దిశగా బాబు దృష్టి సారిస్తే మంచిదన్న మాట ఏపీ ప్రజలకు సరికొత్త ఆశల్ని రేకెత్తిస్తుందనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News