కరోనా భయం తూచ్.. రోజులో లక్షల కేజీలు లాగించేశారు

Update: 2020-03-30 03:45 GMT
దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ వేళ.. వచ్చిన తొలి ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. అవాక్కు అయ్యేలా చేశాయి. లాక్ డౌన్ ఉన్నప్పటికీ.. నిత్యవసర వస్తువుల కొనుగోలు కోసం ప్రజలు బయటకు రావచ్చన్న మినహాయింపును ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రజలు ఫలానా సమయం నుంచి ఫలానా వేళలో బయటకు వచ్చి తమకు అవసరమైన ముఖ్యమైన నిత్యవసర వస్తువుల్ని కొనుగోలు చేసుకోవచ్చని చెప్పటం తెలిసిందే. తెలంగాణలో అయితే.. ఒక వ్యక్తి తాను ఉండే ఇంటికి మూడు కి.మీ. మేర షాపులకు వెళ్లి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. వారం మొత్తం ఇళ్లల్లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తొలిసారి వచ్చిన ఆదివారం వేళ భిన్నంగా వ్యవహరించారు. ఇళ్లకే పరిమితమై.. కూరగాయలతో చేసిన వంటలకే పరిమితమైన వారు.. సండే రోజున రోటీన్ కు భిన్నంగా ముక్క కోసంరోడ్ల మీదకు వచ్చారు. ఈ వచ్చిన రద్దీ పుణ్యమా అని రోడ్లు తిరనాళ్లను తలపించేలా మారాయి. మరి ముఖ్యంగా.. చికెన్.. మటన్ అమ్మే షాపుల వద్ద బారులు తీరారు.

ఈ సందర్భం గా కరోనా వ్యాప్తికి చెక్ పెట్టే కీలకమైన సామాజిక దూరాన్ని చాలామంది పాటించలేదు. ముక్క దొరికితే చాలన్నట్లుగా వారి తీరు ఉండటం గమనార్హం. కొద్ది మంది అయితే.. ముఖానికి ఎలాంటి మాస్కులు లేకుండానే ముక్క కోసం ఎగబడిన తీరు విస్మయానికి గురి చేసింది. మొన్నటి వరకూ ఉచితంగా కోళ్లు పంపిణీ చేయటం.. కేజీ చికెన్ రూ50లకే అమ్మిన స్థానే.. ఆదివారం చికెన్ ధర కేజీ రూ.190 వరకూ పలకటం విశేషం.

పోలీసులు ఎంత మొత్తుకున్నా పట్టనట్లుగా నాన్ వెజ్ మార్కెట్ల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తెలంగాణలోని హైదరాబాద్.. ఏపీలోని విశాఖపట్నంలో నాన్ వెజ్ కోసం భారీ రద్దీ చోటు చేసుకుంది. ఒక్క ఉత్తరాంధ్రలో ఆరు లక్షల కేజీల చికెన్ అమ్మకాలు సాగినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ లో అయితే.. ఉదయం పది.. పదకొండు గంటలకే చికెన్ షాపుల్లో స్టాక్ ఖాళీ అయి.. నో స్టాక్ బోర్డులు పెట్టేయటం గమనార్హం.

కరోనా వేళ.. చికెన్ తింటే మంచిది కాదన్న ప్రచారం.. గడిచిన వారం రోజులుగా టీవీల్ని ఫాలో కావటం.. ఇలాంటి వేళ.. రోగనిరోధక శక్తిని పెంచేందుకు.. బలాన్ని పెంచే నాన్ వెజ్ తినటం మంచిదన్న మాటల్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు మనసుకు తీసుకున్నట్లుగా చెప్పాలి. దీంతో.. ఇప్పటివరకూ ఉన్న ధరలకు భిన్నమైన ధరలు పలికాయి. చికెన్ కొన్ని చోట్ల కేజీ రూ.200 వరకు వెళితే.. మటన్ ఏకంగా రూ.800 నుంచి రూ.900 వరకూ పలికింది. ఇక చేపల విక్రయాలు కూడా జోరుగా సాగాయి. కరోనా వేళ ముక్క ముట్టుకునేందుకు వణికిన ప్రజలు.. అందుకు భిన్నంగా ఎగబడిన తీరు విస్మయానికి గురి చేసింది. దీంతో రోజులోనే లక్షల కేజీల ముక్క అమ్ముడైనట్లుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News