చంద్రబాబు ఇలాకాలో కొత్త నోట్లతో లంచాలు..

Update: 2016-12-13 08:41 GMT
ఇండియాలో పూర్తిస్థాయిలో క్యాష్ లెస్ లావాదేవీలు అసాధ్యమని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తేల్చిచెప్పేశారు.  ఈ రోజు నాగ‌పూర్‌ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంపై మాట్లాడుతూ ఎన్డీఏ సర్కారుపై మండిప‌డ్డారు. స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల‌ దేశంలో పేద‌లు ఎన్నో బాధ‌లు ప‌డుతున్నారని అన్నారు. ఇది ఎన్డీఏ స‌ర్కారు తీసుకున్న‌ అసంబద్ధ చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. స‌ర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఎదిరించ‌లేక‌ రాజీపడుతూ - క‌ష్టాలు ప‌డుతూ ప్ర‌జ‌లు బ‌తికేస్తున్నారని ఆయ‌న అన్నారు. ఏపీ సెక్రటేరియట్ లో అప్పుడే కొత్త నోట్లతో లంచం తీసుకుంటున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
    
దేశంలో పెద్ద నోట్ల రద్దుకు మించిన విపత్తు ఇంతవరకు చూడలేదని చెప్పారు.  ఇంతవరకు ప్రకృతి విపత్తులు కూడా ఎన్నడూ ఇలా దేశ వ్యాప్తంగా ప్రజలను నష్టపెట్టలేదని ఆయన అన్నారు.  డబ్బు లేక వ్యాపారాలన్నీ స్తంభించిపోయాయన్నారు. కేంద్ర బడ్జెట్‌ ను దాదాపు 100 మంది టీంతో రూపకల్పన జరుగుతుందని… అయినా విషయాన్నీ రహస్యంగానే ఉంటాయని చెప్పారు. మరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు రహస్యాన్ని పాటించినా కనీసం బీజేపీ నేతే అయినా జశ్వంత్ సిన్హా లాంటి వారి సలహాలు కూడా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
    
తొలుత నల్లధనాన్ని నిర్మూలించేందుకే పెద్ద నోట్ల రద్దు అని చెప్పిన మోడీ.. ఇప్పుడు క్యాష్‌ లెస్‌ ఎకానమీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని చిదంబరం విమర్శించారు. లక్ష్యం నుంచి ఫిరాయించడంలో భాగంగానే మోడీ ఇలాంటి ప్రకటన చేశారన్నారు. పెద్ద నోట్ల రద్దు అంశం ముందే లీక్‌ అయిందని, దీని వెనుక అతి పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. క్యాష్‌ లెస్ ఎకానమీ ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేదన్నారు చిదంబరం. మన దేశంలో నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు నిరంతర విద్యుత్ - ఇంటర్‌ నెట్‌ సదుపాయాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇప్పటికే రద్దయిన పెద్దనోట్లలో 13 కోట్ల బ్యాంకులకు చేరిందని - మరో 15 రోజుల్లో ఇంకా వస్తుందన్నారు. అలా పెద్ద కరెన్సీ మొత్తం తిరిగి బ్యాంకులకు వస్తే మరి నల్లధనం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. అప్పుడే లంచాలు తీసుకోవడం కూడా పెద్దనోట్ల రూపంలోనే జరుగుతోందంటూ ఏపీలోని వెలగపూడి సచివాలయంలో ఒక చీఫ్‌ ఇంజనీర్‌ రెండు వేల రూపాయల నోట్లను లంచంగా తీసుకుంటూ పట్టుబడిన అంశాన్ని చిదంబరం ప్రస్తావించారు. నల్లధన నిర్మూలనకు ఇది మార్గం కానేకాదన్నారు. నోట్ల రద్దు వల్ల దేశ జీడీపీ దారుణంగా పడిపోతుందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో విదేశీ ఇన్వెస్టర్ల తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని ఇది దేశానికి మంచి పరిణామం కాదన్నారు చిదంబరం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News