పొద్దున విమర్శలు..సాయంత్రమేమో జోకులు

Update: 2016-08-16 05:51 GMT
70వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వ్యవస్థల మధ్య విభేదాలు.. వ్యక్తిగతమైన అంశాల మీద ప్రభావం చూపించకుండా.. హుందాగా వ్యవహరించే వైనం ఎలా ఉంటుందన్న విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ తన మాటలతో.. చర్యలతో చేసి చూపించారు. విధానపరమైన అంశాలపై తనకున్న అసంతృప్తిని దాచుకోని ఆయన.. నిర్మోహమాటంగా బయటపెట్టేందుకు వెనుకాడలేదు. అలా అని దాన్ని వ్యక్తిగత అంశంగా తీసుకోకుండా హుందాగా వ్యవహరించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రకోట మీద నుంచి ప్రధాని చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించిన ఆయన.. ‘గంటన్నర పాటు ప్రధాని చేసిన ప్రసంగంలో జడ్జిల నియామక అంశాన్ని ప్రస్తావిస్తారని ఎదురు చూశా. కానీ నిరాశే మిగిలింది. నేను ప్రధానికి ఓ విషయం చెప్పాలనుకున్నాను. పేదరికాన్నినిర్మూలించండి. యువతకు ఉపాధి కల్పించండి. అదే సమయంలో సామాన్యుడికి న్యాయం చేసేందుకు ప్రయత్నించండి’’ అని వ్యాఖ్యానించారు.

బ్రిటీష్ హయాంలో కేసుల పరిష్కారానికి పదేళ్లకు పైగా సమయం పట్టేదని.. ప్రస్తుతం కేసుల సంఖ్య.. ప్రజల ఆశలు పెరిగాయని.. వాటిని చేరుకోవటం కష్టమైన పనిగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో జడ్జిల నియామకంపై దృష్టి సారించాలని ప్రధానిని కోరుతున్నట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఒక నిష్టూరాన్ని కూడా తన మాటల్లో వ్యక్తం చేశారు. ‘‘మీరు ఇతరులకు పండ్లు.. పూలు ఇచ్చారు. మాకు మాత్రం మొండిచేతులు చూపారు. మాకూ ఏదైనా ప్రసాదించండి’’  అన్న అర్థం వచ్చే ఉర్దూ పద్యాన్ని ఆలపించటం గమనార్హం. ఇన్ని వ్యాఖ్యలు చేసిన చీఫ్ జస్టిస్ సాయంత్రం వేళ.. రాష్ట్రపతి నిర్వహించిన ‘‘ఎట్ హోం’’ కార్యక్రమంలో  ప్రధాని మోడీతో కలిశారు. ఇరువురు చాలాసేపు జోకులేసుకుంటూ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోవటం కనిపించిందంటూ వార్తా కథనాలు వెలువడ్డాయి. ఉదయం మోడీకి తాను చెప్పాలనుకున్న విషయాన్నిచీఫ్ జస్టిస్ చెప్పారో లేదో..?
Tags:    

Similar News