ఆ చిన్నారి పే..ద్ద పెంకిఘ‌ట‌మ‌ట‌

Update: 2017-08-24 07:33 GMT
సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని చాలానే విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. రెండు.. మూడు రోజుల క్రితం చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్ర‌తి మీడియా సంస్థ ఒక చిన్నారికి సంబంధించిన వార్త‌ను అచ్చేశాయి. సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ కావ‌ట‌మే కాదు.. యావ‌త్ దేశాన్ని క‌దిలించిన చిన్నారి ఏడుపు.. ప‌లువురు ప్ర‌ముఖులు స్పందించేలా చేసింది. చూసేవ‌న్నీ నిజాలు కావ‌న్న‌ట్లుగా ఆ చిన్నారి ఏడుపు విష‌యంలో దేశ వాసులు త‌ప్పులో కాలేసిన‌ట్లుగా చెబుతున్నారు.

అతి దీనంగా ఒక చిన్న పాప ఏడుస్తూ.. రెండు, మూడు అంటూ నెంబ‌ర్లు అప్ప‌జెబుతున్న వైనం.. మ‌ధ్య‌లో మ‌ర్చిపోతున్న ఆ చిన్నారిని గ‌ద్దిస్తున్న ఒక క‌ర‌కు గొంతు విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ ఫీల‌య్యారు. అంత చిన్న పాప‌ను అంత దారుణంగా ఏడిపిస్తూ.. అంకెలు నేర్పించ‌క‌పోతే ఏం కొంప‌లు మునుగుతాయి? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పిల్ల‌ల చ‌దువు విష‌యంలో అంత మొండిత‌నం మంచిది కాదంటూ సుద్దులు చెప్పినోళ్లూ ఉన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆ పాప ఎవ‌రు? ఆమెకు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు రాకున్నా.. ఆ పొట్టి వీడియో విప‌రీతంగా వైర‌ల్ అయ్యింది. అయితే.. ఈ చిన్నారికి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అతి దీనంగా ఏడుస్తూ.. ఎంతోమంది కంటత‌డి పెట్టించిన ఆ చిన్నారి  ఎవ‌రో కాద‌ని.. త‌న మేన‌కోడ‌లే అంటూ ప్ర‌ముఖ గాయ‌కుడు క‌మ్ సంగీత ద‌ర్శ‌కుడు తోషి స‌బ్రి వెల్ల‌డించారు. హంప్టీ శ‌ర్మాకీ దుల్హ‌నియా.. రాజ్ చిత్రాల‌కు మ్యూజిక్ డైర‌క్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన స‌బ్రి.. పాప‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర అంశాల్ని బ‌య‌ట‌పెట్టారు.

ఆ పాప చిన్నారి పెద్ద మొండిఘ‌ట‌మ‌ని.. ఆ పాప‌కు చ‌దువు చెప్ప‌టం సామాన్యమైన విష‌యం కాద‌ని.. గ‌ట్టిగా చెప్ప‌కుంటే మాట విన‌ద‌ని పేర్కొన్నాడు. క‌నీసం పుస్త‌కం వంక కూడా చూడ‌ద‌ని.. వీడియోలో అంత‌లా ఏడ్చిన పాప‌.. ఆ త‌ర్వాత క్ష‌ణంలో పుస్త‌కం ప‌క్క‌న పారేసి ఆడుకోవ‌టానికి వెళ్లిపోయింద‌ని చెప్పాడు.

ఆ పాప అంటే వాళ్ల త‌ల్లిదండ్రుల‌కు ఎంతో ప్రేమ అని.. చ‌దువు విష‌యంలో చాలా పెంకిగా ఉండే ఆ పాప‌ను గ‌ట్టిగా మంద‌లించి చ‌దివించే ప్ర‌య‌త్నం చేస్తే ఎలా రియాక్ట్ అయ్యింద‌న్న విష‌యాన్ని పాప తండ్రికి తెలియ‌జేసేందుకు త‌ల్లే వీడియో తీశార‌న్నారు. ఫ్యామిలీ మెంబ‌ర్ల‌కు వాట్స‌ప్ లో పెట్టిన వీడియో బ‌య‌ట‌కు రావ‌టం.. అదో పెద్ద వైర‌ల్ కావ‌టంతో తాను ఈ విష‌యాన్ని చెప్పాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నాడు. కేవ‌లం పాప మంచి కోస‌మే క‌ఠినంగా ఉన్నారే త‌ప్ప‌.. ఆ పాప అంటే వారికి చాలా.. చాలా ఇష్ట‌మ‌ని పేర్కొన్నాడు.

Full View
Tags:    

Similar News