వీగ‌ర్ ముస్లింల‌పై చైనా దాష్టీకం.. మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు - నిర్బంధాలు!

Update: 2021-02-07 02:30 GMT
క‌మ్యూనిస్టు చైనా క‌ర్క‌శ కబంద హ‌స్తాల మ‌ధ్య వీగ‌ర్ ముస్లింలు న‌లిగిపోతున్నారా? వీగ‌ర్ ముస్లింల విష‌యంలో చైనా.. ప్ర‌పంచా నికి పైకి చెబుతున్న‌ది ఒక‌టి.. తెర‌చాటు చేస్తున్న నిర్బంధాలు, దాష్టీకం మ‌రొక‌టా? అంటే.. ఔన‌నే అంటున్నాయి మీడియా రిపోర్టులు!! కొన్ని నిజాలు ఎంత దాచాల‌న్నా దాగ‌వు. ఇలాంటి వాటిలో వీగ‌ర్ ముస్లింల విష‌యంలో చైనా చేస్తున్న దాష్టీకం అత్యంత కీల‌క‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వీగ‌ర్ ముస్లింల‌ను అన్ని విష‌యాల్లోనూ అణిచి వేసే దిశ‌గా చైనా ప్ర‌భుత్వం చేప‌డుతున్న చ‌ర్య‌లు తీవ్ర వివాదాల‌కు, హింసాయుత ప్ర‌వృత్తికి, నిర్బంధాల‌కు అద్దం ప‌డుతోంది.

ఎవ‌రీ వీగ‌ర్‌లు?
వీగ‌ర్ ముస్లింలు చైనా, క‌జ‌కిస్థాన్ దేశాల‌కు చెందిన పౌరులు. అయితే.. వీరు జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో వీగ‌ర్ ముస్లింలు వేర్పాటు వాదాన్ని తెర‌మీదికి తెచ్చారు. త‌మ‌కు ప్ర‌త్యేక హ‌క్కులు, ప్రాంతం కావాల‌ని ఉద్య‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఈ నేప‌థ్యంలో వీరిపై ఉగ్ర‌వాదులు అనే ముద్ర వేసింది చైనా ప్ర‌భుత్వం ముఖ్యంగా 2014 ప్రాంతంలో వీగ‌ర్లు త‌మ ఉద్య‌మాన్ని ఉద్రృతం చేయ‌డంతో చైనా ప్ర‌భుత్వం ఉక్కుపాదంతో అణిచివేత‌కు శ్రీకారం చుట్టింది. వీగ‌ర్ల‌ను ప్ర‌త్యేక శిబిరాల్లో పెట్టి.. వీరి మతపరమైన స్వేచ్ఛను, ఇతర హక్కులు, స్వాతంత్ర్యాన్ని క్రమక్రమంగా తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాదు.. వీగ‌ర్ల‌పై సామూహిక నిఘా, నిర్బంధం, బలవంత బోధన, స్టెరిలైజేషన్‌కు పాల్పడుతున్నారు. అప్పుడ‌ప్పుడు ఈ విష‌యం వెలుగు చూస్తున్నా.. ఇన్నేళ్ల‌లో అటు చైనా ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా వెల్ల‌డించ‌లేదు. పైగా ప్ర‌పంచం త‌మ‌పై దాడి చేస్తోంద‌నే వాద‌నను తెర‌మీదికి తెచ్చింది. పది లక్షలకన్నా ఎక్కువమంది మహిళలు, పురుషులను ఈ శిబిరాల్లో నిర్బంధించిన‌ట్టు తెలుస్తోంది.

శిబిరాల్లో ఏం జ‌రుగుతోంది?
వీగ‌ర్ ముస్లింల‌ను ప్ర‌త్యేక శిబిరాల్లో ఉంచి చైనా పాల‌కులు.. వీరిని అన్ని రూపాల్లోనూ హింస‌కు గురి చేస్తున్నారు. ఇటీవ‌ల తుర్సునే జియావుదున్ అనే 42 ఏళ్ల మ‌హిళ ఈ శిబిరం నుంచి త‌ప్పించుకుని క‌జిక్ చేరుకుంది. ఈమె వెల్ల‌డించిన విష‌యాల‌ను బ‌ట్టి.. శిబిరాల్లో చైనా పాల‌కులు పాల్ప‌డుతున్న దాష్టీకాలు ఒక్కొక్క‌టిగా ప్ర‌పంచానికి తెలియ‌వ‌చ్చాయి. వీగ‌ర్ ముస్లింల‌కు 'రీ ఎడ్యుకేషన్` పేరిట నిర్వ‌హిస్తున్న శిబిరాల్లో ఒక పథకం ప్రకారం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని.. వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ, హింసిస్తున్నారని తుర్సునే ఆధారాల‌తో స‌హా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. తుర్సునే దాదాపు 9 నెల‌ల పాటు.. ఈ శిబిరాల్లో గ‌డిపారు. ఈమెపై కూడా సామూహిక అత్యాచారాలు అనేక మార్లు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

అత్యంత పాశ‌వికంగా..!
``శిబిరాల్లోకి పురుషులు ఎప్పుడూ మాస్క్‌తోనే కనిపించేవారు. అప్పటికి కరోనా లేనే లేదు, అయినా మాస్కులు ధరించేవారు. వాళ్లు పోలీస్ యూనిఫాంలు కాకుండా మామూలు సూట్లు వేసుకునేవారు. అర్ధరాత్రి దాటాక వాళ్లు సెల్‌లోకి వచ్చేవారు. వాళ్లకు నచ్చిన మహిళలను ఎత్తుకెళిపోయేవారు. అదే కారిడార్‌లో నిఘా కెమేరాలు లేని బ్లాక్ రూంకు తీసుకెళ్లేవారు" అని జియావుదున్ వివరించారు. నిర్బంధ శిబిరాల్లో ప్రతి రోజూ మహిళలను వేరే గదికి తీసుకెళ్లేవారని, ఒకరు లేదా కొంతమంది మాస్క్ వేసుకున్న పురుషులు వారిపై అత్యాచారం చేసేవారని జియావుదున్ తెలిపారు. తనను బాగా హింసించారని, మూడు సార్లు గ్యాంగ్‌రేప్ చేశారని చెప్పారు. జియావుదున్ పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వకుండా ఆమె జిన్‌జియాంగ్ విడిచి వెళ్లలేని పరిస్థితులు కల్పించారు. 2018 మార్చి 9న తనను ఒక స్థానిక పోలీస్ స్టేషన్‌కు రమ్మని పిలిచారని, తనకు "మరింత విద్య అవసరమనిష చెప్పి.. తిరిగి క్యూనెస్ కౌంటీలోని నిర్బంధ శిబిరానికి పంపించారు. సాముహిక అత్యాచారాలకు పాల్పడడమే కాక ఎలక్ట్రిక్ షాక్‌లు ఇస్తూ దారుణంగా హింసిస్తున్నారని ఆమె చెప్పారు.

చైనా వాద‌న ఇదీ!
వీగ‌ర్ శిబిరాల విష‌యం వెలుగు చూసిన త‌ర్వాత చైనా స్పందించింది. అయితే.. త‌న వాద‌న వేరేగా ఉండ‌డం గ‌మ‌నార్హం. జిన్జియాంగ్‌లో ఉన్నవి నిర్బంధ శిబిరాలు కావని, "వృత్తి విద్య శిక్షణా శిబిరాలని`` అధికారులు తెలిపారు. "చైనా ప్రభుత్వం, స్థానిక మైనారిటీ వర్గాల హక్కులు, ప్రయోజనాలను సమానంగా పరిరక్షిస్తుంది. మహిళల హక్కులకు ప్రాముఖ్యమిస్తుంది" అని తెలిపారు.




Tags:    

Similar News