చైనాలో భారీగా తగ్గిపోతున్న జనాభా.. అప్పటికి భారతే నెంబరు 1

Update: 2022-05-31 11:30 GMT
జనరల్ నాల్డెజ్ ఎంత పూర్ గా ఉన్నప్పటికీ.. ప్రపంచ జనాభాలో నెంబరువన్ స్థానం ఎవరన్న ప్రశ్నకు మాత్రం ఇట్టే సమాధానం చెప్పేస్తారు చైనా అని ఎవరైనా. అలాంటి చైనాలో విస్మయానికి గురి చేసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ జనాభాలో భారీగా తగ్గుదల చోటు చేసుకుంటోంది. దీనికి సంబంధించి వాషింగ్టన్ వర్సిటీ వేసిన లెక్కలు ఆసక్తికరంగానే కాదు.. ఫ్యూచర్లో చైనా పరిస్థితి ఎలా ఉండనుందన్న విషయంపై షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా రానున్న కొన్ని సంవత్సరాల్లో జనాభా భారీగా తగ్గిపోవటమే కాదు.. నెంబర్ వన్ ట్యాగ్ నుంచి చాలా దూరం అవుతుందని చెబుతున్నారు.

ప్రస్తుతం 141 కోట్ల జనాభా ఉన్న చైనాలో గత ఏడాదిలో పెరిగిన జనాభా కేవలం 4.8 లక్షలే కావటం గమనార్హం. 2019లో షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంచనా ప్రకారం 2021 తర్వాత జనాభా క్షీణత 1.1 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అంతేకాదు.. 2100 నాటికి చైనా జనాభా భారీగా తగ్గటం ఖాయమంటున్నారు. అకాడమీ అంచనా ప్రకారం 58.7 కోట్లకు తగ్గిపోయి.. ఇప్పుడున్న 141 కోట్ల జనాభా స్థానే 109 కోట్లకు తగ్గనున్నట్లు చెబుతున్నారు. అప్పటికి భారత జనాభా పెరిగిపోయి 144.7 కోట్లకు చేరుతుందని.. దీంతో నెంబర్ వన్ స్థానం పోయి.. నెంబర్ టూకు తగ్గాల్సి వస్తోందని చెబుతున్నారు.

2100నాటికి భారత్ మొదటి స్థానంలో.. చైనా రెండోస్థానంలో.. నైజీరియా మూడోస్థానంలో నిలుస్తుందని చెబుతున్నారు. తర్వాతిస్థానాల్లో అమెరికా 43.4 కోట్లు.. పాకిస్థాన్ 40.3 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.

ఒక్కరికి ఒక్క బిడ్డ విధానాన్ని తీసేసినా.. జనాభా నియంత్రణను చైనీయులు పక్కాగా పాటిస్తుండటం గమనార్హం. సామాజిక.. ఆర్థిక పరిస్థితుల కారణంగా పిల్లల్ని కనేందుకు చైనా మహిళలు ఆసక్తిని చూపటం లేదంటున్నారు. కరోనా తర్వాత గర్భధారణకు అక్కడి మహిళలు ఆసక్తిని చూపించటం లేదంటున్నారు. 1980లో అక్కడి సంతానోత్పత్తి రేటు 2.6 శాతం ఉండగా ప్రస్తుతం అది కాస్తా 1.15 శాతానికి తగ్గింది. చిన్న కుటుంబాలకు అలవాటు పడిన వారు.. పెద్ద కుటుంబాలకు అస్సలు ఆసక్తి చూపించటం లేదంటున్నారు.

దీనికి తోడు జీవన వ్యయం పెరిగిపోవటం.. వివాహ వయసును పెంచటంతో జనన రేటు మీద ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు. చైనాలో ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. ఇప్పుడా దేశంలో పని చేసే వారి సంఖ్య తగ్గి.. 65 ఏళ్లకు పైబడిన పెద్ద వయస్కుల సంఖ్య పెరిగింది.

ప్రస్తుతం వంద మంది పని చేసే వయసులో ఉన్న వారు 20 మంది వృద్ధులను చూసుకోవాల్సి వస్తే.. 2100 నాటికి వంద మంది 120 మందిని చూసుకునే పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. అదే జరిగితే.. చైనా ఆర్థిక పరిస్థితి దారుణంగా ప్రభావితం అవుతుందంటున్నారు. కార్మికుల సంఖ్య తగ్గిపోతే.. కార్మిక వ్యయం ఎక్కువ అవుతుందని.. దీంతో కార్మిక వ్యయం చౌకగా ఉంటే భారత్.. వియత్నాం.. బంగ్లాదేశ్ తదితర దేశాలకు వెళ్లిపోతారని చెబుతున్నారు. చూస్తుంటే.. రానున్న రోజులు చైనాకు ఏ మాత్రం మంచిరోజులు కావన్నమాట.
Tags:    

Similar News