చైనా కొత్త సరిహద్దు చట్టం .. భారత్ కి కొత్త సమస్యలు రాబోతున్నాయా !

Update: 2021-10-26 11:30 GMT
భారత్‌‌ తో సరిహద్దు వివాదాల నడుమ, బోర్డర్స్‌ లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చైనా శనివారం కొత్త చట్టాన్ని ఆమోదించింది. చైనా రూపొందించుకున్న ఈ సరిహద్దు చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుండి అమలులోకి రాబోతోందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. 2020 ఏప్రిల్‌ నుంచి భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వియత్నాం, మియాన్మార్ నుండి అక్రమంగా సరిహద్దును దాటుతున్న వారి కారణంగా చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కోవడం చైనాకు సవాలుగా మారింది.

అలాగే తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, అఫ్గానిస్తాన్‌ లో పరిస్థితులను చైనా నిరంతరం గమనిస్తోంది. మరోవైపు షిన్‌ జియాంగ్ ప్రావిన్స్‌ లోని వీగర్ ముస్లింవర్గానికి చెందిన ఇస్లామిక్ తీవ్రవాదులు సరిహద్దు దాటి తన వైపుకు రావచ్చని చైనా భయపడుతోంది.  సరిహద్దు భద్రతా ఏర్పాట్లపై ఈ చట్టం ఎలాంటి ప్రభావం చూపుతుందనే దాని గురించి స్పష్టత లేనప్పటికీ, దీనికి, ఇండియా-చైనా సరిహద్దు వివాదానికి సంబంధం ఉందని చాలామంది భావిస్తున్నారు. సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించి చైనా ఒక చట్టాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి అని కూడా అంటున్నారు. చైనా 14 దేశాలతో దాదాపు 22 వేల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది.

ఇందులో 12 దేశాలతో భూ సరిహద్దు వివాదాన్ని చైనా పరిష్కరించుకుంది. భూటాన్‌ తో 400 కిలోమీటర్ల ప్రాంతంలో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు మూడు దశల రోడ్‌ మ్యాప్‌ పై ఈ ఏడాది అక్టోబర్ 14న చైనా సంతకం చేసింది. చైనాకు సరిహద్దు వివాదం మిగిలి ఉన్న ఏకైక దేశం ఇండియానే. తూర్పు లద్ధాఖ్, ఈశాన్య రాష్ట్రాలలోని సరిహద్దుల విషయంలో భారత్, చైనాల మధ్య దీర్ఘకాలంగా వివాదం ఉంది. ఈ సమయంలో చైనా కొత్త చట్టం తీసుకు వచ్చింది. కమాండర్ స్థాయి చర్చలు అనేక రౌండ్లు జరిగినప్పటికీ, తూర్పు లద్ధాఖ్‌లో ఏడాదికి పైగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. .

కొత్త భూ సరిహద్దు చట్టంలో చైనా సరిహద్దు రక్షణను 'చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత'తో ముడిపెట్టింది.భూ సరిహద్దు చట్టం తర్వాత సరిహద్దు భద్రతా పద్ధతులను మార్చాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నప్పటికీ, దాని సరిహద్దుల నిర్వహణతో చైనాలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని ఈ చట్టం ఏర్పాటు చెప్పకనే చెబుతోంది.సైనిక వివాదం లేదా సరిహద్దు భద్రతకు ముప్పు కలిగించే యుద్ధం జరిగితే చైనా తన సరిహద్దులను మూసివేయవచ్చని చట్టం పేర్కొంది. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి సపోర్టుగా ఉండటానికి, సరిహద్దు ప్రాంతాలలో ప్రజా సేవలను, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి చైనా చర్యలు తీసుకోవచ్చని చట్టం చెబుతోంది.

చైనా 1963లో పాకిస్తాన్‌తో సరిహద్దు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం 'తాత్కాలికం'. కానీ చైనా, పాకిస్తాన్ మధ్య స్నేహం రహస్యం కాదు అని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ చెప్పారు. అంటే ఇప్పుడు చైనాకు సరిహద్దు వివాదం కేవలం భారత్, భూటాన్‌‌లతోనే ఉంది. భూటాన్‌‌తో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితిలో చైనా కొత్త చట్టంతో తలనొప్పులు భారతదేశానికే ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు. భారతదేశం దృష్టిలో, చైనా ఇప్పుడు రక్షణ నిర్వహణను సరిహద్దుతో మాత్రమే కాకుండా సరిహద్దు చుట్టూ ఉన్న ప్రాంతపు ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ముడి పెట్టింది. 2020 చివరి నాటికి, సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి టిబెట్ సరిహద్దులో చైనా 600 సరిహద్దు గ్రామాలను నిర్మించింది.

ఆ గ్రామాలను కలిపే రోడ్లు కూడా చాలా బాగున్నాయి. కనీసం 130 రోడ్లు కొత్తవి లేదా మరమ్మతులు చేసినవి ఉన్నాయి. ఈ మొత్తం పని 3080 కి.మీ. విస్తీర్ణంలో జరిగింది. మరి దీనివల్ల భారత్‌‌కు వచ్చే నష్టమేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. భారతదేశం-చైనాల మధ్య 3,488 కి.మీ. భూ సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు జమ్మూ-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళుతుంది.ఇది మూడు భాగాలుగా ఉంది. పశ్చిమ సెక్టార్ అంటే జమ్మూ-కశ్మీర్, మధ్య సెక్టార్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు సెక్టార్ అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఇరు దేశాల మధ్య చాలా ప్రాంతాలకు సంబంధించి సరిహద్దు వివాదం ఉన్నందున ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య స్పష్టమైన హద్దులు లేవు. అయితే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) అనే పదాన్ని యథాతథ స్థితిని కొనసాగించడానికి ఉపయోగిస్తారు.

2018-19 సంవత్సరపు వార్షిక నివేదికలో చైనాతో సరిహద్దుల వద్ద రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం 3812 కి.మీ ప్రాంతాన్ని గుర్తించినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 3418 కి.మీ రోడ్ల నిర్మాణ పనులను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి  అప్పగించారు. వీటిలో చాలా ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రెండు దేశాల మధ్య వివాదానికి అనేక కారణాలలో ఈ నిర్మాణ పనులు కూడా ఒకటని భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని విశ్లేషించే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తూర్పు లద్ధాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి జరిగిన సంఘటనలు సరిహద్దు ప్రాంతాలలో శాంతికి తీవ్రంగా భంగం కలిగించాయి. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపిందని భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా గత వారం అన్నారు.
Tags:    

Similar News