వెయ్యి పడకల ఆసుపత్రి ఎలా ఉంది?

Update: 2020-02-09 01:30 GMT
తొమ్మిదంటే తొమ్మిది రోజుల్లో ఏకంగా వెయ్యి పడకల ఆసుపత్రిని ప్రత్యేకంగా కట్టిన వైనం చైనాలోనే కాదు.. యావత్ ప్రపంచం ఆసక్తికరంగా చర్చించుకుంది. విరుచుకుపడుతున్న కరోనా వైరస్ కు చెక్ చెప్పేందుకు వీలుగా.. తాత్కాలిక పద్దతిలో యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన ఈ ఆసుపత్రి ఎలాఉంది? ఎలా పని చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

చైనా ప్రభుత్వం తో పాటు.. అధికారగణం ఇరవై నాలుగు గంటలు శ్రమించి ఈ భారీ ఆసుపత్రి నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేయటం ద్వారా.. చైనా సత్తా ఏమిటన్నది ప్రపంచానికి చాటేలా చేశారని చెప్పాలి. మరి.. ఇంత స్వల్ప వ్యవధిలో నిర్మించిన ఆసుపత్రి ఎలా ఉంది? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్న విషయంపై ఎంక్వయిరీలు మొదలయ్యాయి.

దీనికి కారణం లేక పోలేదు.నెలల తరబడి.. వేలాది కోట్లు ఖర్చు పెట్టిన అమరావతిలోని భవనాలు వర్షాకాలంలో లీకులతో పాటు.. గదుల్లోకి నీళ్లు వచ్చిన వైనం తెలిసిందే. అలాంటిది కేవలం తొమ్మిది రోజుల్లో అంత భారీ నిర్మాణాన్ని నిర్మించినప్పుడు లోపాలు ఉండవా? అంటే.. లేవంటే లేవని తేల్చేస్తున్నారు.

ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారంతా.. తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పటమే కాదు.. ఇద్దరు రోగులకు ఒక గదిని కేటాయించినట్లుగా చెబుతున్నారు. ప్రతి రోగికి అన్ని వైద్య పరికరాల్ని అందుబాటులో ఉంచారని.. ఆక్సిజన్ అందించే పరికరాలతో పాటు.. ఏసీ.. టీవీ.. బాత్రూం లాంటి వసతులు కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఏమైనా.. ఇలాంటి అద్భుతం చైనీయులకే సాధ్యమేమో?
Tags:    

Similar News