పాక్ త్యాగాల దేశ‌మ‌ట‌....చైనా వ‌క్ర‌భాష్యం!

Update: 2018-01-09 10:15 GMT
ఉగ్ర‌వాదం పేరు చెప్ప‌గానే ప్ర‌పంచ దేశాల‌కు గుర్తుకు వ‌చ్చే తొలి పేరు పాకిస్థాన్. భార‌త్ పై ఉగ్ర‌దాడులు చేసేందుకు ఎల్ల‌పుడూ గోతికాడ న‌క్క‌లా దాయాది దేశం కాచుకొని ఉంటుంది. ఏ చిన్న‌ అవ‌కాశం దొరికినా ఉగ్ర‌దాడుల‌కు తెగ‌బ‌డి అమాయ‌కుల ప్రాణాల‌ను పొట్ట‌న‌బెట్టుకొని పైశాచికానందం పొందుతుంది. ఉగ్రవాద నిర్మూల‌న కోసం పాక్ కు మూడు ద‌శాబ్దాలుగా ప్ర‌పంచ‌ దేశాల‌కు పెద్ద‌న్నలా వ్య‌వ‌హ‌రించే అమెరికా ....నిధులు అంద‌జేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ దేశం ఆ నిధుల‌ను ఉగ్ర‌వాద నిర్మూల‌నకు ఉప‌యోగించ‌క‌పోవ‌డ‌మే కాకుండా....భార‌త్ వినాశ‌నానికి వినియోగించ‌డంపై అగ్ర‌రాజ్యం గుర్రుగా ఉంది. దీంతో, న్యూ ఈ య‌ర్ రోజున పాక్ కు అమెరికా షాక్ ఇచ్చింది. పాక్ కు తమ దేశం నుంచి వ‌స్తున్న నిధులను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా, నిధుల కోసం ఆ దేశం అబద్ధాలు చెప్పి త‌మ‌ను మోసం చేసి....త‌మ నేత‌ల‌ను ఫూల్స్ ను చేసింద‌ని ఆరోపించారు.గత 15ఏళ్ల నుంచి పాక్ కు అమెరికా దాదాపు 33 బిలియన్‌ డాలర్లకు పైగా నిధులు ఇచ్చింద‌ని, ఇక‌పై నిధుల‌ను నిలిపివేస్తున్నామ‌ని ట్వీట్ చేశారు. ఈ నేప‌థ్యంలో....పాక్ కు చైనా మ‌రోసారి మ‌ద్ద‌తుగా నిలిచింది. పాక్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌ని - ఉగ్రవాదాన్ని ఆ దేశంతో ముడిబెట్ట‌డం పై చైనా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ ప్ర‌కారం చైనా విదేశాంగ ప్రతినిధి లుకాంగ్....పాక్ పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పాక్ ఉగ్రవాద నియంత్రణలో ఎన్నో త్యాగాలు చేసిందని, అన్ని దేశాలు ప‌ర‌స్ప‌రం సహకరించుకొని ఉగ్రవాద నిర్మూల‌నకు న‌డుం బిగించాల‌న్నారు.

భార‌త్ - పాక్ ల మ‌ధ్య ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను చైనా చాలా బాగా క్యాష్ చేసుకుంటోంది. భార‌త్ అంటే త‌మ‌కు గౌర‌వ‌మ‌ని చెబుతూనే....మ‌రోపక్క పాక్ తో క‌లిసి క‌య్యానికి కాలుదువ్వుతోంది. పాక్ కు మిత్ర‌దేశంగా వ్య‌వ‌హ‌రిస్తూ.... భార‌త్ పై వీలు చూపుకొని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తోంది. ఎక‌నామిక్ కారిడార్ లో భాగంగా పాక్ లో  చైనా భారీగా పెట్టుబ‌డులను  పెట్టి ఆ దేశంతో మైత్రిని కొన‌సాగించాల‌ని చూస్తోంది. దీంతోపాటు, పాక్ లోని గ్వదర్‌ నౌకాశ్రయం సమీపంలోని జివానీలో చైనా ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ చేస్తోంది.ఉగ్రవాది మసూద్‌ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్ర‌క‌టించాల‌న్న ఐక్యరాజ్యసమితి యత్నాలకు చైనా అడ్డుపడుతోంది.

తాలిబాన్‌ - హక్కానీ నెట్‌ వర్క్‌ - హిజ్బుల్‌ ముజాహిదీన్‌ - లష్కర్‌ తొయిబా వంటి క‌రుడుగ‌ట్టిన ఉగ్ర‌వాద సంస్థ‌ల‌పై పోరుకు పాక్ కు అమెరికా నిధుల‌ను అంద‌జేసింది. కానీ, వాటిని...ఆయుధాలను కొనుగోలు చేసి.....భారత్ పై ఉగ్ర‌దాడులు చేసేందుకు వినియోగించింది. దీంతో, అమెరికాకు ఒళ్లుమండి ఆ సాయాన్ని నిలిపివేసింది. ఈ విష‌యంపై గ‌తంలో చాలామంది అమెరికా అధ్య‌క్షులు ప్ర‌క‌ట‌న‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ....ట్రంప్ మాత్రం చేత‌లు చేసి చూపించారు.  దీంతో, చైనా పై ర‌కంగా వ్యాఖ్య‌లు చేసింది.

Tags:    

Similar News