కశ్మీర్ ఇష్యూలో పాక్.. చైనాలకు భారీ పంచ్

Update: 2020-01-16 04:36 GMT
అంతర్జాతీయ వేదికల మీద ఏదోలా భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు ఇరుగుపొరుగైన చైనా.. పాకిస్థాన్ లు ఎప్పుడూ ఏదోలా ప్లాన్ చేస్తుంటారు. ఇటీవల కశ్మీర్ ఇష్యూలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో.. ఆ అంశాన్ని అంతర్జాతీయ వేదికల మీద భారత్ ను బద్నాం చేయాలన్న ఆలోచనకు పంచ్ పడింది. ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటం ద్వారా భారత్ ను ఇరుకున పెట్టాలని చైనా.. పాక్ లు ప్రయత్నించాయి.

అయితే.. వారి ప్రయత్నాన్ని ప్రపంచ దేశాలు అడ్డుకోవటమే కాదు.. వారికి భారీ పంచ్ పడేలా చేశారు. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య సమావేశంలో చర్చించాలని డ్రాగన్ డిమాండ్ చేస్తే.. అందుకు ఇతర దేశాలు నో చెప్పాయి. అంతేకాదు.. కశ్మీర్ అంశం భారత్ - పాక్ ద్వైపాక్షిక విషయంగా తేల్చేశాయి. దీంతో.. చైనాకు.. దాన్ని ముందుకు నెట్టిన పాక్ కు భంగపాటు తప్పలేదని చెప్పక తప్పదు.

కశ్మీర్ అంశాన్ని చర్చించాలన్న వినతిని ఇతర దేశాలు తిరస్కరిస్తూ.. చర్చలతో పరిష్కరించుకోవాలన్న హితబోధ చేశాయి. అందరి కంటే ముందు ఫ్రాన్స్ రియాక్ట్ అవుతూ.. గతంలో మాదిరే తామీ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. గత నెలలో ఐక్యరాజ్య సమితి రహస్య సమావేశంలో కశ్మీర్ గురించి చర్చించటానికి చేసిన ప్రయత్నాన్ని ఫ్రాన్స్.. అమెరికా.. బ్రిటన్.. రష్యాలు వ్యతిరేకించాయి.

ఇదిలా ఉంటే.. తాజా ప్రయత్నానికి దెబ్బ పడిన నేపథ్యంలో  ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్విత ప్రతినిధి కేంద్రమంత్రి జై శంకర్ స్పందించారు. ఇతర దేశాలతో విభేదించటం తమ ఉద్దేశం కాదని.. ఉద్రిక్తతలు ఎదురైనప్పుడు తొందరపడకుండా సంయమనం పాటించి నిర్ణయాత్మకంగా వ్యవహరించటం భారత్ ప్రధాన లక్ష్యంగా స్పష్టం చేశారు. చైనా.. పాక్ ప్రయత్నాల్ని మిగిలిన దేశాలు అడ్డుకోవటంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. పరస్పరం సహకరించుకునేలా భారత్ - చైనా సంయమనంతో వ్యవహరించాల్సి ఉందని చెప్పటం గమనార్హం.


Tags:    

Similar News