మ‌నపై సైనిక చర్యకు చైనా రెడీ

Update: 2017-08-06 06:04 GMT
భారత్ - చైనా మధ్య డోక్లాం వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇరుదేశాల మధ్య ఇన్ని రోజులు మాటల యుద్ధం జరుగగా.. తాజాగా భారత్‌ పై స్వల్పస్థాయి యుద్ధానికి చైనా వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. భారత్-చైనా-భూటాన్ ముక్కోణపు జంక్షన్‌ లోని డోక్లాం నుంచి ఎలాగైనా భారత బలగాలను తరిమివేయాలని, ఇందుకుగాను రెండు వారాల్లోగా స్వల్పస్థాయి సైనిక చర్య చేపట్టాలని చైనా యోచిస్తున్నట్లు ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో ఒక వ్యాసం ప్రచురితమైంది.

షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌ కు చెందిన పరిశోధక విద్యార్థి హూ జియాంగ్ ఈ వ్యాసాన్ని రాశారు. కొన్నేళ్లుగా భారత్ అపరిపక్వంగా వ్యవహరిస్తోంని, చైనా ఆలోచన విధానానికి అనుగుణంగా భారత్ ఎదుగడం లేదని వ్యాసంలో పేర్కొన్నారు. అంతేగాక డోక్లాం విషయంలో ఇటీవల భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చేసిన ప్రకటనలను పరిశీలిస్తే, వివాదానికే భారత్ మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోందని విశ్లేషించారు. ఇరుదేశాల సైనికులు ముందుగా వెనక్కి వెళ్లాలని, తర్వాతనే చర్చలు జరుగుతాయని సుష్మా పేర్కొన్నట్లు చెప్పారు. వచ్చే నెలలో చైనాలో బ్రిక్స్ దేశాల సమావేశం జరుగనున్న నేపథ్యంలో భారత్‌ను హెచ్చరిస్తూ గ్లోబల్ టైమ్స్ వ్యాసాన్ని ప్రచురించడం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి కూడా భారత్‌ ను హెచ్చరిస్తూ తమ సహనం తుది దశకు చేరుకున్నదని పేర్కొన్న విషయం తెలిసిందే.

మ‌రోవైపు గత నెల 18నుంచి డోక్లామ్‌ కు సంబంధించి ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో రెండు దేశాలు సమాన సంఖ్యలో ఇరువైపులా సైన్యాన్ని మోహరించిన విషయం తెలిసిందే. భారత్ తన సైన్యాన్ని కొంతమేర వెనక్కి తీసుకుందంటూ చైనా ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు ఇటీవ‌లే అధికార వర్గాలు సమాచారాన్ని వెల్లడించాయి. చైనా ప్రకటన నేపథ్యంలో వాస్తవాన్ని వెల్లడించిన భారత వర్గాలు దాదాపు 400మంది భారత సైనికులు ఇప్పటికీ డోక్లామ్ ప్రాంతంలో ఉన్నారని వెల్లడించాయి. చైనా తాజాగా జారీచేసిన ప్రకటనలో భారత దళాలు 400 నుంచి 40కి తగ్గిపోయాయని, జూలై చివరి నాటికే ఈ పరిణామం చోటుచేసుకుందని స్పష్టం చేసింది. మొత్తం పదిహేను పేజీల వాస్తవ నివేదికను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జూన్ 18 నాటికి 270మంది భారత సైనికులు ఆయుధాలు, రెండు బుల్‌ డోజర్లతో డొక్లామ్ వద్ద సిక్కిం సెక్టార్ సరిహద్దు దాటారని తెలిపింది. ఆ విధంగా దాదాపు వందమీటర్ల తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చి చైనా తన ప్రాదేశిక ప్రాంతంలో నిర్మిస్తున్న రహదారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారని, దానివల్లే ఈ సమస్య అంతా తలెత్తిందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ప్రకటనను ఖండించిన భారత్ డోక్లామ్‌ లో తన సైనిక దళాలను తగ్గించుకోలేదని స్పష్టం చేయడమే కాక శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉండాలంటే సరిహద్దు ప్రాంతంలో శాంతి, ప్రశాంతత అవసరమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
Tags:    

Similar News