జ‌గ‌న్‌ ను ఇరుకున ప‌డేసిన ఏపీ స‌ర్కారు

Update: 2016-08-13 04:46 GMT
కృష్ణా పుష్క‌రాల‌కు ఆహ్వానం పంపించే ఎపిసోడ్ వివాదాస్ప‌దంగా మారుతోంది. ప్ర‌ముఖుల్లో దాదాపు ప్ర‌తి ఒక్క‌రికి ఆహ్వానం అందించిన ఏపీ ప్ర‌భుత్వం వైసీపీ అధ్యక్షుడు - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్‌ జగన్‌ ను విస్మ‌రించిందని విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఏపీ మంత్రులు రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ నివాస‌మైన లోట‌స్ పాండ్ లో ఒకింత గంద‌ర‌గోళం నెల‌కొంది.

వైఎస్ జ‌గ‌న్‌ ను పుష్కరాలకు ఆహ్వానించేందుకు ఏపీ మంత్రి రావెల కిషోర్‌ బాబు - ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ లోటస్‌ పాండ్‌ వెళ్లగా వారికి అపాయింట్‌ మెంట్‌ లేదని సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి రావెల మీడియాతో మాట్లాడారు. పుష్క‌రాల‌కు ఆహ్వానించేందుకు 15 రోజులుగా జగన్‌ ను అనుమతి కోరుతున్నామని తెలిపారు. శ‌నివారం ఉదయం 10 గంటలకు వచ్చి మరోసారి పుష్కరాలకు ఆహ్వానిస్తామని చెప్పారు. ఇదిలాఉండ‌గా ఏపీ హోంమంత్రి చినరాజప్ప సైతం ఈ ఎపిసోడ్‌ పై స్పందించారు. జగన్‌ ను కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించలేదని అనడం అవాస్తవమని తెలిపారు. జగన్‌ ను ఆహ్వానించేందుకు తానే స్వయంగా లోటస్‌ పాండ్‌ వెళ్లానని చెప్పారు. ఇంటి ముందు ఉన్న పోస్టు డబ్బాలో ఆహ్వాన పత్రికను వేయాలని సిబ్బంది చెప్పారని చిన‌రాజ‌ప్ప‌ వివరించారు.

మ‌రోవైపు ఈ ప‌రిణామంపై వైసీపీ నేత‌లు అసంతృప్తి  వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌ముఖుల‌ను కొంద‌రు కావాల్సిన వారికి మంత్రి స్థాయి వ్య‌క్తి వెళ్లి మ‌రి ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆహ్వానించ‌గా.... కేబినెట్ హోదా క‌లిగిన ప్ర‌తిప‌క్ష నేత‌ను విస్మ‌రించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అమ‌రావ‌తి ఆహ్వానం స‌మ‌యంలో చేసిన విధంగానే ఇపుడు సైతం ప్ర‌వ‌ర్తించార‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే లోట‌స్ పాండ్ వ‌ద్ద వివాదం చేసి త‌మ నాయ‌కుడిని ఇరుకున ప‌డేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News