రాహుల్‌ తో దోస్తీ..బాబు చెడ్డీకి బెల్ట్‌

Update: 2018-11-20 06:39 GMT
కాంగ్రెస్‌ - టీడీపీల దోస్తీపై తెలుగు రాష్ర్టాల్లోనే కాదు దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు వివిధ ప‌క్షాలు వివిధ రూపంలో స్పందించిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు పార్టీల ప్ర‌త్య‌ర్థులు విరుచుకుప‌డుతుండ‌గా...ఇదేం దోస్తీ అని రాజ‌కీయ విశ్లేష‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా...తెలుగుదేశం పార్టీ ఈ దోస్తీని త‌మ‌దైన శైలిలో స‌మ‌ర్థించుకుంటోంది. బీజీయేతర పార్టీలను ఏకం చేయడానికి..జాతీయ స్థాయంలో మరోసారి చక్రం తిప్పేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమ‌వుతున్నార‌ని అందులో భాగ‌మే ఈ దోస్తీ అని క‌వ‌ర్ చేసుకుంటోంది. మ‌రోవైపు ఈ దోస్తీపై భ‌గ్గుమంటూ ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు పార్టీకి గుడ్‌ బై చెప్పేస్తున్నారు. అయితే, ఈ ఎపిసోడ్‌ లో తాజాగా ఓ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ముఖ్య‌నేత ఒక‌రు చిత్రంగా విశ్లేషించారు. రాహుల్‌-బాబు దోస్తీ  చెడ్డీకి బెల్ట్ పెట్టుకోవ‌డం వంటిద‌న్నారు.

ఈ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేసింది కేంద్ర మాజీ మంత్రి - కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ చింతా మోహన్. ఇందిరాగాంధీ జయంతి సంద‌ర్భంగా తిరుపతి గాంధీభవన్‌ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంతో వేగంగా మలుపు తిరుగుతున్నాయని విశ్లేషించారు. చంద్రబాబు చెడ్డీ ఊడిపోతోందని తాను గతంలో విమర్శించానని దీంతో బాబు అల‌ర్ట్ అయ్యార‌ని తెలిపారు. చంద్ర‌బాబు తెలివిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి మహా కూటమికి శ్రీకారం చుట్టి ఊడిపోతున్న చెడ్డీకి బెల్ట్ బిగించుకున్నాడని ఆయన చమత్కరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని పార్టీలన్నీ ఏకమై ఓడించాయన్నారు. అందుకు రాష్ట్ర విభజన సాకుగా చూపాయని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమని అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ కు పూర్తిస్థాయి న్యాయం జరగాలన్నారు. విభజన చట్టంలోని హామీలు నెరవేరాలన్నా - ప్రత్యేక హోదా రావాలన్నా - పెట్రోల్ - డీజిల్ ధరలు తగ్గాలన్నా - మహిళల రిజర్వేషన్ అమలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. .


Tags:    

Similar News