​పవన్ లేదా జగన్ పార్టీకి కావాలి ​

Update: 2016-03-31 12:59 GMT
పవన్ - జగన్ లు వస్తే తప్ప పార్టీ బతకదని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి ఆయన వ్యక్తిగతంగా మీడియాతో చెప్పిన మాటలు కాదు, ఈరోజు పీసీసీ ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నేతలంతా హాజరయిన సభలో కార్యకర్తల సాక్షిగా చేసిన వ్యాఖ్యలు. "కాంగ్రెస్ పార్టీ బతకాలంటే... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీలోకి రావాలి. జగన్ ను ఒప్పించి తీసుకురావాలి. వైఎస్ జగన్ వస్తేనే పార్టీ బతుకుతుంది. ఒక వేళ.. జగన్ ఒప్పుకోకపోతే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలి. ఎలాగైనా పవన్ ను పార్టీలోకి తీసుకురావాలి. పార్టీ వారితో మాట్లాడాలి" అంటూ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యాభై శాతం కార్యకర్తలు పవన్ లేదా జగన్ ను పార్టీలోకి తేవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పడంతో ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి.

చింతా మోహన్ ఇలా మాట్లాడటం మొదలుపెట్టగానే కాంగ్రెస్ కార్యకర్తలు అల్లరి చేయడం మొదలుపెట్టారు. ఆయన ప్రసంగం ఆపాలని, ఏందీ సోది అంటూ వేదిక ఎక్కి వివాదానికి దిగారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అయినా తెలుస్తోందా అని మండిపడ్డారు. ఈ సందర్భంలో ఏం చేయాలో తెలియక వేదికపైనే ఉన్న పీసీసీ ఏపీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తల పట్టుకుని కూర్చున్నారు. గొడవ చల్లార్చడానికి నేతలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

చింతా మోహన్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కార్యకర్తల్లోనే కాదు, నేతల్లో కూడా పార్టీ భవితవ్యంపై ఎంత నైరాశ్యం ఉందో స్పష్టంగా చెబుతున్నాయి. నేతలే బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తలకు ఇక మనోధైర్యం ఎక్కడినుంచి వస్తుంది. నానాటికీ ఏపీలో కాంగ్రెస్ ఎంత దిగజారుతుందో చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణ ఏముంటుంది?!
Tags:    

Similar News