బెయిల్ రావటానికి ముందే లొంగిపోనున్న చింతమనేని

Update: 2019-09-11 05:33 GMT
వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరేగిపోయే టీడీపీ నేతల్లో ఒకరిగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాబు ప్రభుత్వంలో చింతమనేని తీరు వివాదాస్పదంగా మారటమే కాదు.. ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చి పెట్టారు. తన దూకుడు స్వభావంతో పలు విమర్శలు ఎదుర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో తనకు తిరుగులేదని గొప్పలు చెప్పే ఆయన.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలు కావటం తెలిసిందే.

ఇటీవల కాలంలో ఆయనపైన పలు ఫిర్యాదులు పోలీసులకు వచ్చాయి. వివిధ ఆరోపణలపై ఆయనపై కేసులు నమోదు చేశారు.  దీంతో.. దాదాపు పన్నెండు రోజుల క్రితం ఆయన కనిపించకుండా పోయారు. చింతమనేని అజ్ఞాతం సంచలనంగా మారటమే కాదు..ఆయన్ను అదుపులోకి తీసుకోవటం కోసం పోలీసులు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ దొరకలేదు.

ఇలాంటివేళలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తప్పు చేశారు కాబట్టే.. చింతమనేని అజ్ఞాతంలో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై రియాక్ట్ అయ్యారు చింతమనేని. తాజాగా ఒక మీడియా సంస్థకు ఫోన్ చేసిన చింతమనేని.. తాను పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు ప్రకటించి సంచలనంగా మారారు. ఒకవైపు చింతమనేని ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నప్పటికీ ఆయన్ను అదుపులోకి తీసుకోవటం సాధ్యం కాని దుస్థితి.

పోలీసులకు దొరక్కుండా అండర్ గ్రౌండ్ లో ఉన్న చింతమనేని.. మరోవైపు తన న్యాయవాదులతోకలిసి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే గురువారం నాటికి చింతమనేనికి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి సమయంలో బొత్స చేసిన వ్యాఖ్యలకు ఫీలైన చింతమనేని.. తనకు ముందస్తు బెయిల్ రాకున్నా తాను పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు వెల్లడించారు. మంత్రి బొత్స తనను అన్న మాటల్ని సీరియస్ గా తీసుకున్న ఆయన.. తాను తప్పు చేయలేదని.. అక్రమంగా తనపై కేసులు నమోదు చేశారని.. అంతే తప్పించి తాను తప్పించుకు తిరగటం లేదన్న చింతమనేని ఈ రోజు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయే అవకాశం ఉందంటున్నారు. బెయిల్ రావటానికి రోజు ముందు పోలీసుల ఎదుట లొంగిపోనున్న చింతమనేనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News