తేనెతుట్టెను కదిల్చిన కరణం

Update: 2022-09-19 05:32 GMT
అధికారపార్టీకి సంబందించి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం తేనెతుట్టెలాగ తయారైంది. తెనెతుట్టెను ఎవరు కదిలించినా ఇబ్బందులు తప్పనట్లే ఈ నియోజకవర్గంలో పార్టీకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కారణం ఏమిటంటే వచ్చేఎన్నికల్లో చీరాల నుండి పోటీచేయటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కరణం వెంకటేష్ ప్రకటించారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో పోటీచేయటానికి మాజీ ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ రెడీగా ఉన్నారు.

చీరాల నుండి రెండుసార్లు గెలిచిన ఆమంచి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయినా మళ్ళీ పోటీచేయాలనే పట్టుదలతో ఉన్నారు. మామూలుగా అయితే ఆమంచికి టికెట్ విషయంలో ఇబ్బందులుండకపోను. కానీ టీడీపీ తరపున గెలిచిన కరణం బలరామ్ వైసీపీకి దగ్గరవ్వటంతో ఆమంచికి సమస్యలు మొదలయ్యాయి. ఎంఎల్ఏ తాను వైసీపీలో చేరకుండా తనకొడుకు వెంకటేష్ ను చేర్పించారు. అప్పటినుండి తండ్రి, కొడుకులిద్దరు వైసీపీలో యాక్టివ్ గా ఉన్నారు.

ఎప్పుడైతే కరణం, ఆమంచి ఇద్దరు ఒకచోట చేరారో అప్పటినుండి వీళ్ళమధ్య గొడవలు మొదలై పెరిగిపోయాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని ఆమంచిని పరుచూరు ఇన్చార్జిగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో మాజీ ఎంఎల్ఏని పరుచూరు నుండి పోటీచేయమని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఆమంచి మాత్రం చీరాలలో పోటీకే మొగ్గు చూపుతున్నారు. దాంతో రెండువర్గాల మధ్య గొడవలవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలను పోటీపోటీగా రెండువర్గాలు దేనికదే నిర్వహిస్తున్నాయి. స్ధానిక నేతల్లో చాలామంది కరణం వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

ఈ నేపధ్యంలోనే కరణం వెంకటేష్ చేసిన ప్రకటన ఇపుడు హాట్ టాపిగ్గా మారిపోయింది. తాను పోటీచేస్తానని వెంకటేష్ చేసిన ప్రకటనపై ఆమంచి వర్గం మండిపోతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని వెంకటేష్ ఎలా చెప్పారంటు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కరణం వర్గం ఎంత చెప్పినా చివరకు టికెట్ దక్కేది ఆమంచికే అంటు ఆయన వర్గం ఎదురుదాడి మొదలుపెట్టింది. దీంతో మళ్ళీ రెండువర్గాల మధ్య గొడవలయ్యే అవకాశముంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News