తండ్రి ఆశయాలపై అన్నా చెల్లీ చెరోమాట!

Update: 2016-04-14 12:16 GMT
వారిద్దరూ అన్నా చెల్లెళ్లే! రాజకీయంగా తండ్రి తమ జిల్లా ప్రజలకు చేసిన సేవ - సంపాదించిన మంచి పేరు పునాదిగా.. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వారిద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ రాజకీయాల్లో బాగానే స్థిరపడ్డారు. కానీ ఇప్పుడు అదే తండ్రి ఆశయాల గురించి పరస్పర విరుద్ధంగా చెరొక మాట చెబుతున్నారు. ఆ అన్నా చెల్లెళ్లు మరెవరో కాదు. తాజాగా గులాబీ తీర్థం పుచ్చుకున్న మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహనరెడ్డి - గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ. ఇద్దరూ నిన్నటి వరకు ఒకే పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ప్రజాజీవితంలో సేవ చేస్తున్న వాళ్లే...! ఇప్పుడు ఆయన హఠాత్తుగా పార్టీ మారారు! అందుకు సంబంధించి ఆమె ఇంకా కత్తులు నూరుతున్నారు.

వీరిద్దరి తండ్రి నర్సిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిగా పాలమూరు జిల్లానుంచి ప్రజలకు సేవలందించిన నిష్కళంక నాయకుడిగా చాలా పేరు గడించారు. పాలమూరు జిల్లాలో నీటి ప్రాజెక్టుల గురించి ఆయన ఎంతో తపన పడ్డారు. అయితే నిన్న పార్టీ మారిన సందర్భంగా చిట్టెం రామ్మోహనరెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు నీటి ప్రాజెక్టుల పూర్తి గురించి తన తండ్రి ఎంతో కల గన్నారని, ఇన్నాళ్లకు కేసీఆర్‌ వాటిని పూర్తి చేయబోతున్నారని కితాబులిచ్చారు. భీమా ప్రాజెక్టు రూపకల్పనలో తన తండ్రి చేసిన కృషిని కూడా ప్రస్తావించారు. తన తండ్రి కన్న కలలు ఇప్పుడు కేసీఆర్‌ తీరుస్తున్నారు అన్నట్లు చెప్పుకొచ్చారు.

అయితే ఆయన పార్టీ ఫిరాయింపు గురించి సోదరి డికె అరుణ ఇవాళ మీడియా ముందు నిప్పులు చెరిగారు. 'అవసరం అయితే బిచ్చమెత్తుకుంటా గానీ.. తెరాసలో మాత్రం చేరబోయేది లేనేలేదంటూ అరుణ ఫైర్‌ కావడం విశేషం. తాను విలువలకు కట్టుబడి ఉంటానని, తమ కుటుంబంలో చిచ్చు పెట్టే రాజకీయాలకు తెరాస పాల్పడుతోందని అన్నారు. రామ్మోహనరెడ్డి చేసిన పనితో తన తండ్రి ఆత్మ క్షోభిస్తున్నదని అరుణ చెప్పడం విశేషం. తన తండ్రి ఆశయాలకు ఆయన మచ్చ తెచ్చారంటూ పరస్పర విరుద్ధంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

అసలు నాయకుడు నర్సిరెడ్డి ఇప్పుడు మనమధ్య లేరు. ఆయన వారసులు.. ఎవరి రాజకీయ భవిష్యత్తును వారు చూసుకుంటూ రెండు శత్రు పార్టీల్లో ఫిక్సయ్యారు. తమకు తోచిన విధంగా తండ్రి ఆశయాలకు భాష్యం చెప్పుకుంటున్నారు. హతవిధీ!
Tags:    

Similar News