బాబు సొంత జిల్లాలో హింస...ఒకరు మృతి

Update: 2019-04-11 18:13 GMT
పోలింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య సాగిన మాటల యుద్ధం అనంతరం ఘర్షణలకు, హింసాత్మక వాతావారణానికి దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పోలింగ్ హింసాత్మకంగా ముగిసింది. ఎన్నికల సందర్భంగా జరిగిన దాడుల్లో ఒకరు మృతి చెందారు. పూతలపట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్‌ బాబుతో పాటు ఆయన కుమారుడిపై టీడీపీ శ్రేణులు భౌతిక దాడి చేశాయి. తీవ్రగాయాలు కావడంతో ఆయనను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న వైసీపీ అభ్యర్థి ఎంఎస్ బాబుకు ఐరాల మండలంలోని పొలకల కట్టకిందపల్లిలో రిగ్గింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం అందటంతో ఆయన  అక్క డకు వెళ్లారు. ఈ సమయంలో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంఎస్‌ బాబును పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లనీయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుని.... దాడి చేయడమే కాకుండా ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఎంఎస్‌ బాబు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

మరోవైపు వైసీపీ కార్యకర్తలు ఈ దాడి వ్యూహాత్మకమని పేర్కొంటున్నారు. పూతలపట్టు మండలంలోని బందార్లపల్లెలో మొదటగా ఎంఎస్‌ బాబుపై దాడులకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయని, అయితే అక్కడ ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తరువాత ఐరాల మండలంలో కట్టకిందపల్లిలో పథకం ప్రకారం దాడులు చేశారని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఎన్నికలు హింసాత్మకంగా మారడం వెను టీడీపీ ఓటమి భయం కనిపిస్తోందని మండిపడ్డారు.

ఇదిలా ఉండగా, ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై దాడులు చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. రెండు గంటల పోలింగ్‌ సమయంలోనే చంద్రబాబు మళ్లీ రీపోలింగ్‌ అనడం ఓటమి భయానికి నిదర్శనమన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దుష్ప్రచారాలు నమ్మొద్దని, ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటమి భయంతో ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై దాడులు చేస్తున్నారని, టీడీపీ నేతల దాడులను ఖండిస్తున్నామన్నారు. 
Tags:    

Similar News