దేవినేని ఉమపై సీఐడీ కేసు.. చేసిన తప్పేంటి?

Update: 2021-04-11 04:51 GMT
ఏపీ అధికారపక్షాన్ని విమర్శించినా.. తప్పు పట్టినా.. వారిపై తీవ్రమైన ఆరోపణలు చేసినా వెంటనే కేసుల్ని నమోదు చేసే పరంపర మొదలు పెడతారన్న ఆరోపణ ఉంది. ఆ వాదనలో నిజం ఎంత? నిజంగానే కావాలని కేసులు పెడుతున్నారా? అన్నది ప్రశ్న. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమపై కర్నూలు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి టీడీపీ నేతలు తప్పు పడుతుంటే.. అధికారుల వెర్షన్ విన్నంతనే.. న్యాయమేగా? అన్న భావన కలుగక మానదు.

ఇంతకీ దేవినేని ఉమపై సీఐడీ కేసు ఎందుకు పెట్టినట్లు? ఆయన చేసిన తప్పేంటి? అన్న విషయంలోకి వెళితే.. ఏపీ సీఎం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేయటం.. నకిలీ వీడియోను ప్రదర్శించటమే కారణమని చెబుతున్నారు. కర్నూలు జిల్లా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో దేవినేని ఉమతో కేసు నమోదు చేవారు. ఈ నెల ఏడున తిరుపతిలో మీడియాలో మాట్లాడిన దేవినేని ఉమా.. సీఎం జగన్ కు తిరుపతి అంటే ఇష్టం లేదనే విధంగా మాట్లాడారన్నారు.

మాటలకే పరిమితం కాకుండా.. నకిలీ వీడియోను ప్రదర్శించారని ఆరోపించారు. ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పెట్టారని.. ముఖ్యమంత్రి అనని మాటల్ని అన్నట్లుగా మార్ఫింగ్ చేయటం.. బుదర జల్లే  ప్రయత్నం చేయటమే కారణమని చెబుతున్నారు. దీంతో దేవినేని ఉమపై ఫిర్యాదు ఇవ్వటం.. కర్నూలు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయటం జరిగినట్లు చెబుతున్నారు. మరి.. దీనిపై ఉమ స్పందించాల్సి ఉంది.
Tags:    

Similar News