వైకాపా నేత‌కు సీఐడీ లైవ్ షాక్‌

Update: 2016-09-02 10:23 GMT
వైకాపా సీనియ‌ర్ నేత భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డికి సీఐడీ అధికారులు భ‌లే షాక్ ఇచ్చారు! ఆయ‌న మీడియా మీటింగ్ పెట్టి.. చంద్ర‌బాబుపై ఫైర్ అవుతున్న స‌మ‌యంలోనే సీఐడీ అధికారులు ఆయ‌నకు తుని విధ్వంస‌కాండ‌కు సంబంధించిన నోటీసులు అందించి భూమ‌న అవాక్క‌య్యేలా చేశారు. దీంతో క‌రుణాక‌ర‌రెడ్డి తీవ్రంగా డిస్ట‌ర్బ్ అయిపోయారు. ఇటీవ‌ల కాలంలో పోలీసులు - అధికారులు త‌మ స్టైల్ ను మార్చేసుకుంటున్నారు. తాము విచారించాల్సిన వ్య‌క్తులు ఎక్క‌డ క‌నిపిస్తే.. అక్క‌డే అదుపులోకి తీసుకోవ‌డం, నోటీసులు ఇచ్చేయ‌డం చేసేస్తున్నారు. గ‌తంలో అయితే, ఆయా వ్య‌క్తుల‌ను ఇళ్ల ద‌గ్గ‌ర‌క‌ల‌వ‌డ‌మో, ఆఫీసుల్లో క‌ల‌వ‌డ‌మో చేసేవారు. కానీ.. మారుతున్న ప‌రిస్థితులు వ్య‌క్తులు త‌ప్పించుకుంటున్న నేప‌థ్యంలో పోలీసులు - అధికారులు త‌మ పంథాను కూడా మార్చుకుంటున్నారు.

  ఇటీవ‌ల ఓ టీవీ లైవ్ ఇంట‌ర్వ్యూలో ఉన్న నిందితుడు డాకూరి బాబును పోలీసులు రెడ్ హ్యాండెడ్‌ గా అరెస్టు చేశారు. అత‌నికోసం తాము తిర‌గ‌ని చోటు లేద‌ని, ఎక్క‌డా దొర‌క‌కుండా త‌ప్పించుకుంటుండ‌డంతో త‌ప్ప‌ని ప‌రిస్థితిలోనే టీవీ స్టూడియోకి వెళ్లి.. డాకూరిని అరెస్టు చేసిన‌ట్టు చెప్పారు అధికారులు. అదేవిధంగా.. ఇప్పుడు సీఐడీ అధికారులు కూడా క‌రుణాక‌ర‌రెడ్డికి లైవ్ మీటింగ్‌ లో నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి విచారణకు రావాలని చెప్పడం గమనార్హం. తునిలో జరిగిన విధ్వంసం కేసులో మీపై ఆరోపణలు వచ్చాయని, నోటీసులు ఇవ్వాలని వారం రోజులుగా మీ కోసం చూస్తున్నామని, అయితే ఎక్కడా అందుబాటులో లేరని ఈ సందర్భంగా సీఐడీ అధికారి ఒకరు భూమనతో అన్న‌ట్టు చెప్పారు.

మీడియా స‌మావేశంలో మీరు మాట్లాడుతార‌ని తెలిసి.. అక్క‌డైతే వీలుగా ఉంటుంద‌ని భావించే వ‌చ్చామ‌ని వారు చెప్ప‌డం  భూమ‌నకు షాక్ ఇచ్చినంత ప‌నైంది. దీంతో ఆయ‌న అనుచ‌రులు కూడా ఒక్క‌సారిగా ఖంగు తిన్నారు. ఇక‌, కాపు ఉద్య‌మం సంద‌ర్భంగా తునిలో ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ ప్రెస్‌ ను త‌గ‌ల‌బెట్టిన కేసులో భూమ‌న పేరు త‌ర‌చూ వెలుగు లోకి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ అధికారులు.. భూమ‌న‌కు ఇలా నోటీసులు ఇవ్వ‌డం వైకాపాలో చ‌ర్చ‌నీయాంశం అయింది. మ‌రి ఈ విష‌యంపై వైకాపా నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News