బాబుకు త‌నిఖీలు... నిబంధ‌న‌ల మేర‌కేన‌ట‌

Update: 2019-06-15 09:49 GMT
టీడీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు నిన్న గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టులో ఎదురైన త‌నిఖీలు క‌క్ష‌సాధింపులు ఎంత‌మాత్రం కాద‌ని తేలిపోయింది. సీఎంగా దిగిపోతే మాత్రం జెడ్ ప్ల‌స్ కేటగిరీ భ‌ద్ర‌త‌లో ఉన్న చంద్ర‌బాబును త‌నిఖీ చేయ‌డ‌మే కాకుండా వీఐపీ ట్రీట్ మెంట్ ను నిరాక‌రించి, సాధార‌ణ ప్ర‌యాణికులకు మ‌ల్లే బ‌స్సులో పంపించ‌డ‌మేమిట‌ని నేటి ఉద‌యం నుంచి టీడీపీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిల‌మ‌వుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం కాగానే.... వైసీపీ స‌ర్కారు క‌క్ష‌సాధింపు చ‌ర్యల‌కు తెర తీసింద‌ని, అందులో భాగంగానే ఏకంగా చంద్ర‌బాబునే టార్గెట్ చేసింద‌ని ఆరోపించారు.

ఈ ఆరోప‌ణ‌ల స్థాయి అంత‌కంత‌కూ పెరిగింద‌ని కూడా చెప్పాలి. అయితే టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌ల్లో ఎంతమాత్రం వాస్త‌వం లేద‌ని, టీడీపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ స‌త్య‌దూరాల‌ని కూడా తేలిపోయింది. ఈ మేర‌కు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ కింద ప‌నిచేస్తున్న బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ సెక‌చ్యూరిటీ సంస్థ‌ ఓ ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది. కేంద్రం ప‌రిధిలోని ఎయిర్ పోర్టుల్లో ముఖ్య‌మంత్రులు, గ‌వ‌ర్న‌ర్ల‌కు మాత్ర‌మే వీఐపీ ట్రీట్ మెంట్ ల‌భిస్తుంద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో ఆ సంస్థ‌ తేల్చి చెప్పింది. ఇక మాజీ సీఎంలు అయినా, జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త ఉన్న నేత‌లు అయినా... వారికి ఎలాంటి వీఐపీ ట్రీట్ మెంట్ ఉండ‌ని కూడా తేల్చేసింది.

ఎయిర్ పోర్టుల‌న్నీ కూడా సెంట్రల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ ఎఫ్‌) భ‌ద్ర‌త కింద ఉంటాయ‌ని, భ‌ద్ర‌త విష‌యంలో సీఐఎస్ ఎఫ్ చెప్పిన‌ట్లుగానే తాము వ్య‌వ‌హ‌రిస్తామ‌ని, ఇందులో ఎలాంటి వాదోప‌వాదాల‌కు తావు కూడా లేద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. ఎయిర్ పోర్టుల్లో ఎవ‌రెవ‌రికి వీఐపీ ట్రీట్ మెంట్ ఇవ్వాలి, ఏ స్థాయి ప్ర‌ముఖుల‌ను ఎలా ట్రీట్ చేయాన్న విషయాల‌న్నీ కూడా సీఐఎస్ఎఫ్ చూస్తుంద‌ని, ఆ మేర‌కు ఆ సంస్థ జారీ చేసిన నిబంధ‌న‌ల మేర‌కే ఎవ‌రైనా న‌డుచుకోవాల‌ని కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఒక్క ప్ర‌క‌ట‌న‌తో నేటి ఉద‌యం నుంచి టీడీపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ ఒక్క దెబ్బ‌కు కొట్టుకుపోయాయ‌ని చెప్పాలి.


Tags:    

Similar News