మాల్స్ లో ఎమ్మార్పీ మాయాజాలం!

Update: 2018-05-11 09:58 GMT
న‌గ‌రాల‌లో షాపింగ్ మాల్స్ కు వెళ్ల‌గానికే ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. దాదాపుగా కావాల్సిన వ‌స్తువుల‌న్నీ ఒకే చోట దొర‌క‌డం....మాల్ యాజ‌మాన్యాలు ర‌క‌ర‌కాల డిస్కౌంట్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌డం....మంత్లీ కార్డులు..వంటి నేప‌థ్యంలో అక్క‌డ‌కు వెళ్లేందుకు ప్ర‌జ‌లు మొగ్గుచూపుతారు. అయితే, ఆ షాపింగ్ మాల్స్ లో తూనిక‌లు స‌రిగా ఉన్నాయా లేదా? ధ‌ర‌లు ఎమ్మార్పీ క‌న్నా అధికంగా వ‌సూలు చేస్తున్నారా లేదా? అన్న సంగ‌తి ప‌ట్టించుకునే తీరిక చాలా మందికి ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో కొన్ని మాల్స్ ల‌లో...తూకంలో మోసం చేయ‌డం....ఎమ్మార్పీ క‌న్నా ఎక్కువ రేటు వ‌సూలు చేయ‌డం వంటి ప‌నుల‌కు పాల్ప‌డుతున్నాయి. తాజాగా, హైద‌రాబాద్ లోని కొన్ని మాల్స్ `మాయా`జాలం బ‌ట్ట‌బ‌య‌లైంది.   గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని షాపింగ్‌ మాల్స్‌ లో అవ‌క‌త‌వ‌క‌ల‌క‌ను తూనికల కొలతల శాఖ అధికారులు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ప‌లు మాల్స్ లో అక్ర‌మాలు జ‌రుగుతున్న‌ట్లు గుర్తించి....కేసులు న‌మోదు చేశారు. దాదాపుగా 23 ల‌క్ష‌ల విలువ గ‌ల వ‌స్తువుల‌ను అధికారులు సీజ్ చేశారు.

హైద‌రాబాద్ లోని ప‌లు షాపింగ్ మాల్స్ లో తూనిక‌లు కొల‌త‌ల శాఖ‌ అసిస్టెంట్‌ కంట్రోలర్ నేతృత్వంలోని బృందాలు తనిఖీలు చేశాయి.  మాదాపూర్ లోని ఇన్‌ఆర్బిట్ మాల్ - పంజాగుట్టలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ - కూకట్ పల్లిలోని ఫోరమ్‌ సుజనా మాల్‌ - బంజారాహిల్స్‌లోని జీవీకేలలో ప్రత్యేక తనిఖీలు నిర్వ‌హించాయి. వారంతా తూనికల కొలతల ప్యాకేజ్డ్‌ కమొడిటీస్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అధికారులు గుర్తించారు. మాల్స్ లోని కొన్ని వస్తువుల‌పై తయారీదారుని పేరు - చిరునామా - వస్తువు తయారీ నెల - సంవత్సరం - పేరు - నికర బరువు - అన్ని పన్నులతో సహా ఎమ్మార్పీ రేటు వంటివి ముద్రించిలేవ‌ని గుర్తించారు. కొన్ని వ‌స్తువుల మీద ఎమ్మార్పీల క‌న్నా అధిక ధ‌ర‌ వసూలు చేయడం, అడిషనల్‌ స్టిక్కరింగ్‌ వంటివాటిని అధికారులు గుర్తించారు. దీంతో, హైదరాబాద్‌ సెంట్రల్‌లో 40 కేసులు నమోదు చేసి రూ. 15 లక్షల విలువ చేసే వస్తువులను....ఇన్ ఆర్బిట్ లో 30 కేసులు....రూ. 3.50 లక్షలు, జీవీకేలో 17 కేసులు...రూ. 3.4 లక్షలు..... ఫోరమ్‌ సుజనాలో 15 కేసులు.... రూ. 90 వేలు వ‌సూలు చేశారు. మొత్తంగా 102 కేసులు న‌మోదు చేసి 23 లక్షలు విలువ చేసే వస్తువు లను తూనికల కొలతలశాఖ అధికారులు సీజ్‌ చేశారు.
Tags:    

Similar News