నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం.. ఏడేళ్ల తర్వాత సీజేఐ!

Update: 2021-08-31 04:30 GMT
కొత్తగా ఎంపికైన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. న చేస్తున్న వారిలో తెలుగోడు.. రాబోయే రోజుల్లో కాబోయే సుప్రీం చీఫ్ జడ్జిగా కొద్దికాలం పాటు విధులు నిర్వహించే అవకాశం ఉన్న పమిడి ఘంటం శ్రీనరసింహ ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలకుపైనే దేశ అత్యున్నత న్యాయస్థానంలో సామాన్యుల సమస్యల మీద వాదనలు వినిపిస్తున్న ఆయన.. ఈ రోజు నుంచి వాదనలు వినే కీలక కుర్చీలో కూర్చోనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. న్యాయవాదిగా వ్యవహరిస్తూ నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.

ఢిల్లీ న్యాయవాద వర్గాల్లో మేధావిగా.. మచ్చలేని జీవితాన్ని గడుపుతూ.. కవిగా.. పండితుడిగా పేరున్న శ్రీ నరసింహకు మరో అద్భుత అవకాశం ఏడేళ్లలో దక్కనుంది. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఆయన.. ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్న ఎన్వీ రమణ తర్వాత సీజేఐ కుర్చీలో కూర్చోన్న తెలుగువాడిగా ఆయనకు గౌరవం దక్కనుంది.

ఇంతకీ ఈ శ్రీనరసింహ ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ పమిడి ఘంటం కోదండరామయ్య కుమారుడే శ్రీ నరసింహ. ప్రకాశం జిల్లా మోదేపల్లి గ్రామంలో పుట్టిన నరసింహ.. చదువు మొత్తం హైదరాబాద్ లోనే సాగింది. బడీచౌకీలోని సెయింట్ ఆంథోనీ స్కూల్లో చదివి.. ఆ తర్వాత నిజాం కాలేజీలో విద్యాభ్యాసం చేశారు.

లా డిగ్రీ పూర్తి చేసేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన.. పట్టా అందుకున్న తర్వాత కూడా దేశ రాజధానిలోనే ప్రాక్టీసు మొదలు పెట్టారు. లాయర్ వృత్తి నుంచి న్యాయమూర్తి పదవికి రావటం మీద ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. కానీ.. ఈ పదవి నరసింహ ఆశించింది కాదని చెబుతారు. 1990లో సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న ఆయనకు హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసే అవకాశం లభించినా.. ఆయన వెళ్లేందుకు ఇష్టపడలేదు. 2014-18లోనాలుగేళ్లు అదనపు సొలిసిటర్ జనరల్ గా వ్యవహరించిన ఆయన ఆ పదవి నుంచి తప్పుకొని లాయర్ గా కొనసాగటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.  

అయోధ్యలో రామమందిర నిర్మాణం నుంచి దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల పరిష్కారానికి ఆయన ప్రయత్నించారు. ప్రాచీన గ్రంధాలపై.. భారత చరిత్ర.. ఇతిహాసాలపై.. కల్చర్ మీద ఆయనకున్న పట్టు.. అయోధ్య కేసు పరిష్కారానికి ఎంతో సాయం చేసిందని చెబుతారు. ఇవాల్టి రోజున బీసీసీఐ ఇంత బలంగా.. శక్తివంతంగా ఉండటానికి కారణం.. గతంలో ఆయన చేసిన కృషిగా చెబుతారు. ‘బోర్డ్‌ ఆఫ్‌ క్రికెట్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో అమికస్‌ క్యూరీగా వ్యవహరించి 145 గంటలపాటు చర్చించి, అందర్నీ ఒప్పించటం ఆయన విజయంగా చెప్పాలి.

నరసింహా ఇంటి పేరులో ఉన్న పమిడిఘంటం అనేది కొత్తగా అనిపిస్తుంది. ఇంతకీ ఆయన ఇంటిపేరు ఎలా వచ్చింది? దాని వెనుకున్న చరిత్రను చూస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. 15వ శతాబ్దంలోని విజయనగర సామ్రాజ్యంలో ఫౌఢదేవరాయల ఆస్థానంలోమంత్రిగా ఉన్న అబ్బయ్య.. నరసింహ పూర్వీకులుగా చెబుతారు. ఆయన కాలంలో వారి ఇంటిపేరు తామరపల్లి. మహా పండితుడైన అబ్బయ్యకు రాజు బంగారు కలాన్ని బహుమానంగా ఇవ్వటంతో అప్పటి నుంచి వారి ఇంటిపేరు పమిడిఘంటంగా మారిందని చెబుతారు. పమిడి అంటే బంగారం అని అర్థం. ఆయనకు తెలుగంటే చాలా ఇష్టమని చెబుతారు. తెలుగువాడిగా పుట్టటం చెప్పలేనంత అదృష్టంగా భావిస్తారు.

తెలుగు భాష సంస్కృతాన్ని మించిందన్నది ఆయన వాదన. అంతేకాదు..ఆదివాసీలన్నా.. అడవులన్నా నరసింహకు ప్రాణం. అందుకే అనేక పర్యావరణ.. అటవీ చట్టాలకుసంబంధించిన కేసుల్లో వాదించారు. అడివిని.. ఆదివాసీలను వేరు చేయలేమని.. మనిషి ఉన్నా లేకున్నా మొక్క ఉంటుంది. ఇదే హక్కు అడవిలో ఉండే ఆదివాసీలకు ఉంటుందని ఆయన వాదిస్తారు. ఆదివాసీలే అడవి.. అడవే ఆదివాసీలు అంటూ ఒక కేసులోఆయన చేసిన వాదనను సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. ఇలా న్యాయవాదిగా ఎన్నో కీలక కేసుల్లో వాదనలు వినిపించారు.

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు కేసులో కూడా ఆడిషనల్ సొలిసిటర్ జనరల్ గా కేంద్ర ప్రభుత్వం తరఫున కీలక వాదనలు చేశారు. జల్లికట్టును పట్టణ మనస్తత్వంతో చూడకూడదని.. ఎద్దు కష్టాన్ని ఆ రోజే చూస్తారు కానీ ఏడాదిలో మిగిలిన కాలమంతా ఆ ఎద్దులను సొంత బిడ్డల్లా పెంచి పోషించిన విషయాన్ని గుర్తించరని ప్రశ్నిస్తారు. ఇలాంటి పండుగలు మానవ సంబంధాలు మెరుగుపడటానికి తోడ్పడతాయని.. ఊళ్లో సినిమా థియేటర్లు.. ఫార్ములా వన్ రేసులు ఉండవని.. ఆ పండుగలు వారి జీవితాల్లో భాగమని వాదించటం ద్వారా సుప్రీంకోర్టు జల్లికట్టు క్రీడ జరగటానికి ఒప్పుకునేలా చేశారు. ఇలాంటివెన్నో ఆయన న్యాయవాది జీవితంలో కనిపిస్తాయి. అలాంటి మేధావి ఈ రోజు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 
Tags:    

Similar News