హనీమూన్ ముగిసినట్లేనా ?

Update: 2021-03-23 17:30 GMT
రెండు పార్టీల మధ్య హనీమూన్ ముగిసినట్లే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే బీజేపీతో కలిసుండటం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉన్నట్లు లేదు. అదే సమయంలో పవన్ తమతో ఉన్నా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే అన్న పద్దతిలో కమలనాదులు వ్యవహరిస్తున్నారు. అంటే ‘రోగి కోరింది..వైద్యడిచ్చింది ఒకటే’ అన్నట్లుగా తయారైంది రెండుపార్టీల వ్యవహారం.

ఎప్పటి నుండో రెండు పార్టీల నేతల మధ్య అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ మధ్య అవి బహిరంగంగా బయటపడుతున్నాయి. వీటికి ఈమధ్యనే జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు (జీహెచ్ఎంసీ) నాంది పలికిందనే చెప్పాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని అనుకుంటే చివరి నిముషంలో బీజేపీ నేతలు జోక్యం చేసుకుని విత్ డ్రా చేయించారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ అవకాశం జనసేనకు ఇస్తామని హామీ ఇస్తేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విత్ డ్రా చేసుకునేందుకు పవన్ అంగీకరించారనే ప్రచారం జరిగింది.

తీరా చూస్తే తిరుపతి ఉపఎన్నికలో కూడా బీజేపీనే పోటీచేస్తోంది. దీనికి నిరసనగానే అన్నట్లుగా మొన్ననే జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో చివరి నిముషంలో టీఆర్ఎస్ అభ్యర్ధి సురభివాణికి మద్దతు ఇస్తున్నట్లు పవన్ ప్రకటించటం సంచలనమైంది. ఒకవైపు బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు పోటీ చేస్తున్నా పవన్ మాత్రం వాణికి ఓట్లేయండని ఇచ్చిన పిలుపుతో కమలంపార్టీ అగ్రనేతలకు కూడా మండిపోయింది.

ఇలాంటి అనేక వివాదాలను చూసిన తర్వాత రెండుపార్టీల మధ్య హనీమూన్ ముగిసిపోయిందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. కలిసి ఉండటం రెండుపార్టీల్లోని నేతలకు ఇష్టం లేదని వాళ్ళ వ్యవహారశైలి వల్లే అర్ధమైపోతోంది. మున్నటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయవాడ, వైజాగ్ కార్పొరేషన్లలో రెండుపార్టీలు దేనికదే పోటీ చేశాయి. దీంతో రెండుపార్టీలు భారీగా నష్టపోయాయి. సో జరుగుతున్నది చూస్తుంటే తెగతెంపులు చేసుకోవటానికి రెండుపార్టీలకు ఎంతో కాలం పట్టదనే అనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News