ఆ 87 శాతం కుటుంబాల‌పైనేనా సీఎం జ‌గ‌న్ ఆశ‌లు!

Update: 2022-07-20 02:30 GMT
గ‌డ‌ప గ‌డ‌ప మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మ స‌మీక్ష‌లో భాగంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్చార్జులు, ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, జిల్లాల పార్టీ అధ్యక్షులతో నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ హాట్ కామెంట్స్ చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో మొత్తం 175కి 175 సీట్లు సాధించాల‌ని సీఎం జ‌గ‌న్ మ‌రోమారు నేత‌ల‌కు ఉద్భోదించారు.

87 శాతం మంది ప్ర‌జ‌ల‌కు ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల ల‌బ్ధి క‌లిగింద‌ని సీఎం జ‌గ‌న్ నేత‌ల దృష్టికి తెచ్చారు. అందువ‌ల్ల 175కి 175 సీట్లు సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌న్నారు. అంటే సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పైనే భారీ స్థాయిలో ఆశ‌లు పెట్టుకున్నారు.

మంత్రులు కూడా ప‌లు సంద‌ర్భాల్లో ఇదే చెబుతున్నారు. 50 ల‌క్ష‌ల మందికి పింఛ‌న్లు ఇస్తున్నామ‌ని, మ‌రో 35 ల‌క్ష‌ల మందికి ఇళ్ల స్థ‌లాలు ఇచ్చామ‌ని వీరంతా త‌మ‌కే ఓట్లు వేస్తార‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే డ్వాక్రా ద్వారా ల‌బ్ధి పొందుతున్న మ‌హిళ‌లు 90 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు ఉన్నార‌ని.. ఇలా కోటి 70 ల‌క్ష‌ల మంది త‌మ‌కు ఖ‌చ్చితంగా ఓట్లేస్తార‌ని లెక్క‌లు క‌ట్టుకుంటున్నారు.

అయితే.. తెలంగాణ‌లోని హుజురాబాద్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా కేసీఆర్ ఎక్క‌డా లేన‌న్ని నిధుల ప్ర‌వాహం, సంక్షేమ ప‌థ‌కాలు, క‌మ్యూనిటీ హాళ్లు, ఎస్సీ ఓట‌ర్లు అంద‌రికీ ప్ర‌తి ఒక్క‌రి ఖాతాలో ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున ద‌ళిత బంధు కింద నిధులు, ఓటర్ల‌కు డ‌బ్బు పంపిణీ, ఊరికో ఎంఎల్ఏ, మండ‌లానికి ముగ్గురు మంత్రుల చొప్పున పెట్టిన ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చార‌ని విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. బీజేపీ అభ్య‌ర్థి ఈటల రాజేంద‌ర్ కే ప‌ట్టం క‌ట్టార‌ని చెబుతున్నారు.

చంద్ర‌బాబు నాయుడు 2019 ఎన్నికల ముందు ప‌సుపు-కుంకుమ పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌హిళ‌లంద‌రికీ రూ.10 వేల చొప్పున పంచిపెట్టార‌ని.. ఆ త‌ర్వాత ఫ‌లితాలు ఆయ‌న‌కు ఎలా షాకిచ్చాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేద‌ని విశ్లేషకులు అంటున్నారు. రాజ‌ధాని నిర్మాణం ఇంత‌వ‌ర‌కు అతీగ‌తీ లేద‌ని, పోల‌వ‌రం ఎప్పుడు పూర్త‌వుతుందో ఆ దేవుడికే తెలియ‌ద‌ని, రాష్ట్రానికి ఒక్క పేరున్న కంపెనీ వ‌చ్చింది లేద‌ని, రోడ్లు, ఇత‌ర మౌలిక వ‌స‌తులు ఎక్క‌డి వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

అస‌లు సిసలైన రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి ప‌థ‌కాలు ఇచ్చాం.. ఇంత‌మందికి ల‌బ్ధి జ‌రిగింది.. వారంతా మాకే ఓట్లేస్తారు అని పిచ్చి లెక్క‌లు వేసుకుంటే కేసీఆర్, చంద్ర‌బాబుల‌కు ప‌ట్టిన గ‌తే జ‌గ‌న్ కు ప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు.
Tags:    

Similar News