అరుదైన ఘనత: అప్పుడు తండ్రి...ఇప్పుడు తనయుడు..

Update: 2019-10-01 10:20 GMT
ప్రతి ఏటా దసరా సమయంలో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ బ్రహోత్సవాలు సందర్భంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. గతంలో ముఖ్యమంత్రులు ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ వచ్చారు. ఇక తాజాగా జగన్ తొలిసారి సీఎం హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తలపై వెండి పళ్ళెంలో పట్టు వస్త్రాలు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు.

అయితే ఇలా పట్టు వస్త్రాలు సమర్పించి సీఎం జగన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సీఎం హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా అనేకసార్లు తిరుమలలోని దేవదేవునికి వస్త్రాలు సమర్పించారు. మళ్ళీ అదే కుటుంబం నుంచి సీఎం అయిన వైఎస్సార్ తనయుడు జగన్ మొదటిసారి వెంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాల లాంఛనాలను సమర్పించారు.

ఇలా తండ్రి-తనయులు అధికారిక హోదాల్లో శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించడం గొప్ప విశేషమనే చెప్పాలి. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే అది రాజుల కాలంలో చోటు చేసుకునే అవకాశముంది. చరిత్రలో విజయనగర పాలకులు శ్రీవారికి అనేకసార్లు లాంఛనాలను సమర్పించినట్టుగా తెలుస్తోంది. వారి వారసత్వపు పాలనలో తండ్రి-కొడుకులు రాజులుగా శ్రీవారికి లాంఛనాలను సమర్పించారని చరిత్ర చెబుతుంది. ఇక ఆ రాజులు తర్వాత శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తండ్రి-తనయులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి - జగన్ మోహన్ రెడ్డిలు అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.


Tags:    

Similar News