ఉగాదికి సీఎం కేసీఆర్ పిలుస్తా.. అది నా మర్యాద.. టీ గవర్నర్ కీలక వ్యాఖ్య

Update: 2022-03-26 04:03 GMT
ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య దూరం పెరిగిందన్న వాదనలు వినిపించటం.. అందుకు తగ్గట్లే పలు పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఎక్కడి దాకానో ఎందుకు ఈ మధ్యనే ముగిసిన సమ్మక్క.. సారలమ్మ జాతరకు వెళ్లేందుకు గవర్నర్ సిద్ధం కావటం..ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రయాణానికి అనువుగా హెలికాఫ్టర్ ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అలాంటిదేమీ లేకపోవటంతో దాదాపు 300కి.మీ. మేర రోడ్డు ప్రయాణం చేయటం తెలిసిందే.

ఏమైనా.. రాష్ట్ర గవర్నర్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ కు దూరం పెరిగినట్లుగా వార్తలు వస్తున్న వేళ.. వాటికి చెక్ పెట్టేలా గవర్నర్ తమిళసై అడుగులు వేస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఆమె ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తో తమకున్న దూరాన్ని తగ్గించుకునేలా ఆమె వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. అదే సమయంలో కేసీఆర్ సర్కారు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించటానికి ఎలాంటి మొహమాటానికి గురి కాకుండా ఓపెన్ అయ్యారు.

రాజ్ భవన్ లో ఉగాది వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని.. దానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు.. అధికార విపక్షాలకు చెందిన వారందరిని తాను ఆహ్వానించనున్నట్లుగా వెల్లడించారు. ‘అందరిని ఆహ్వానిస్తున్నా. ఇది నా మర్యాద. నా ఆహ్వానాన్ని అందరూ స్నేహపూర్వకంగా స్వీకరిస్తారని తాను భావిస్తున్నా. విభేదాలన్నీ కనుమరుగు కావాలని నేను కోరుకుంటున్నా. ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా పాత విషయాల్ని వదిలేసి కొత్త ఆరంభాన్ని మనమంతా కాంక్షిద్దాం’ అని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలంగా రాజ్ భవన్ కు రావట్లేదని.. ఈ గ్యాప్ కు తనవైపు నుంచి ఎలాంటి కారణాలు లేవన్నారు. ‘‘నేను ఏ సమస్యను క్రియేట్ చేయాలని అనుకోను. సీఎంతో పాటు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అందరితోనూ సత్ సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటుంటా. గవర్నర్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. ముఖ్యమంత్రి అనేవారు ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రభుత్వ అధినేత. ఈ ఇద్దరు పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవాలి’ అంటూ హితవు పలికారు.

తనకున్న అధికారాలు.. పరిమితులు తనకు బాగా తెలుసని.. తాను ఎప్పుడూ పరధి దాటలేదన్నారు. రిపబ్లిక్ డే నిర్వాహణ.. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవటం లాంటివి ప్రజల ముందు ఉన్నాయి. నేను ఎవరికి తలొగ్గను. నేనంతే అంటూ ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనుల గురించి ఆమె ప్రస్తావించారు.

పుదుచ్చేరి తో సహా చిన్న రాష్ట్రాలు సైతం ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించాడని.. ఘనంగా చేపట్టాయని.. దేశం.. జాతీయ జెండా మీద ఉన్న గౌరవంతో ఇక్కడ కూడా ఘనంగా జరపాలని భావించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో తామే ప్రభుత్వాన్ని సంప్రదించినట్లుగా గుర్తు చేశారు. వేడుకలకు రావాల్సిన ప్రభుత్వ అధికారులు రాలేదని.. దీంతో రాజ్ భవన్ సిబ్బందే చేశారన్నారు. రాజ్ భవన్ పోలీసులే పరేడ్ చేశారని.. ప్రసంగాన్ని కూడా ప్రభుత్వం పంపలేదని.. ప్రజలతో గవర్నర్ మాట్లాడేందుకు ఉన్న అధికారాల్ని ఎవరూ కాదనలేరంటూ కేసీఆర్ సర్కారు తీరు గురించి వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా నీతులు చెప్పే కేసీఆర్.. రాజ్ భవన్ విషయంలో ఆయన.. ఆయన సర్కారు తీరు ఎలా ఉందన్న విషయాన్ని అర్థమయ్యేలా తన తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారని చెప్పాలి.
Tags:    

Similar News