ఏడేళ్లుగా తీర్చలేదు కానీ.. గెలిపిస్తే మాత్రం 15 రోజుల్లో పరిష్కరిస్తారట

Update: 2021-04-15 05:31 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విలక్షణ అందరికి తెలిసిందే. ప్రాణాలు పోయే సమస్య తన ఎదుటకు వచ్చినా.. కొన్నిసార్లు పట్టించుకోనట్లుగా ఉంటారు. కానీ.. అదే కేసీఆర్ కు ఏదైనా అవసరం వచ్చినప్పుడు.. వారికున్న సమస్య ఏళ్లకు ఏళ్లుగా ఉన్నా.. రోజుల్లో పరిష్కరించే టాలెంట్ ఆయన సొంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన క్షణం నుంచి.. ఇప్పటివరకు ఆయనే అధికారంలో ఉన్నారు. గిరిజనుల పోడు భూముల సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దీనిపై ఇప్పటికే ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఈ సమస్యను పరిష్కరించాలని ఇప్పటివరకు కోరుతున్నా.. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించింది లేదు. పరిష్కార మార్గంపై తాము కసరత్తు చేస్తున్నట్లుగా చెప్పింది లేదు. అలాంటిది సాగర్ ఉప ఎన్నిక పుణ్యమా అని.. దీర్ఘకాలికంగా సాగుతున్న సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇదే విషయాన్ని కేసీఆర్ స్వయంగా చెప్పేశారు. కాకుంటే.. దీనికో లింకు పెట్టారు. సాగర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి భగత్ ను గెలిపిస్తే చాలు.. ఆ సమస్య పరిష్కారాన్ని నాగార్జున సాగర్ నుంచే షురూ చేస్తానని చెప్పారు.

రెండు రోజులు సాగర్ లోనే ఉండి.. ప్రజా దర్బార్ పెట్టి నియోజకవర్గంలో గిరిజనుల పోడు భూముల సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పారు. నెల్లికల్లు ఒక్కటే కాదు.. ఇటీవల దేవరకొండ.. మిర్యాలగూడ.. హుజూర్ నగర్..కోదాడ నియోజకవర్గాల్లో మంజూరు చేసిన ఎత్తిపోతల పథకాల్ని పూర్తి చేయకుంటే ఓట్లు అడగమని తేల్చేశారు. ఏళ్లకు ఏళ్లుగా అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ సమస్యలకు పరిష్కారం చూపలేదనే కేసీఆర్.. దగ్గర దగ్గర ఏడేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్.. పోడు భూముల సమస్యను ఎందుకు తీర్చనట్లు? ఒకవేళ.. సాగర్ ఉప ఎన్నిక రాకుంటే.. కేసీఆర్ ఇవాళ చెప్పిన మాటను చెప్పేవారా? అన్నది ప్రశ్న. ఏమైనా.. తనకు అవసరమైన విజయాన్ని.. ప్రజల అవసరంతో ముడిపెట్టి.. తనకున్న అధికారంతో హామీ ఇచ్చేస్తున్న కేసీఆర్ వ్యూహానికి సాగర్ ఓటర్లు ఏమని తీర్పు ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News