బాబు ఓడితే తిరుమ‌ల‌కు వ‌స్తాన‌ని కేసీఆర్ మొక్కుకున్నారా?

Update: 2019-05-26 05:08 GMT
బాబు ఓడిపోయారు. అది కూడా అలాంటి ఇలాంటి ఓట‌మి కాదు. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటూ త‌ర‌చూ చెప్పే చంద్ర‌బాబు.. త‌న రాజ‌కీయ అనుభ‌వం గురించి వీలైనంత త‌క్కువ మాట్లాడేలా ఆంధ్రోళ్లు తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో తీర్పునిచ్చార‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే.. బాబు అంటేనే అగ్గి మీద గుగ్గిలం అయ్యే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. తాజాగా తిరుమ‌ల పర్య‌ట‌కు రానుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

తిరుమ‌ల‌కు ధీటుగా యాదాద్రిని డెవ‌ల‌ప్ చేస్తామ‌ని.. ఆంధ్రోళ్ల‌కు తిరుమ‌ల ఎలానో.. తెలంగాణ వారికి యాదాద్రి అలా అంటూ చెప్పిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మ స‌మ‌యంలో.. ప్ర‌త్యేక రాష్ట్రం సాధిస్తే తిరుమ‌ల‌కు వ‌చ్చి మొక్కు చెల్లిస్తాన‌ని చెప్ప‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే ఆ మ‌ధ్య‌న ఆయ‌న తిరుమ‌ల‌కు వ‌చ్చి వెళ్ల‌టం తెలిసిందే.

ఆ త‌ర్వాత తిరుమ‌ల‌కు వ‌చ్చింది లేదు. తాజాగా.. బాబు ఓట‌మి.. జ‌గ‌న్ మ‌రికొద్ది రోజుల్లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న వేళ‌.. కేసీఆర్ కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల ప్రోగ్రాం పెట్టుకోవటం ఆస‌క్తిక‌రంగా మారింది. తిరుమ‌ల ట్రిప్ గురించి ఉన్న‌ట్లుండి స‌మాచారంబ‌య‌ట‌కు వ‌చ్చిందే కానీ.. దీని గురించి ముందు నుంచి అనుకుంటున్న‌ది లేదు. దీంతో.. కేసీఆర్ తాజా ట్రిప్ మీద ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి,

ప్ర‌త్యేక రాష్ట్రం మొక్కును చెల్లించ‌టానికి తిరుప‌తికి వెళ్లిన కేసీఆర్.. తాజాగా ఎందుకు వెళుతున్న‌ట్లు? అన్న‌ది క్వ‌శ్చ‌న్ గా మారింది. బాబు దారుణ ఓట‌మి నేప‌థ్యంలో స్వామివారి ద‌ర్శ‌నం చేసుకుంటున్నారా? అంటూ కొంద‌రు చేస్తున్న వ్యాఖ్య‌లు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. మొక్కులు తీరిన వేళ‌.. తిరుమ‌ల‌కు బ‌దులు యాదాద్రి ఉంద‌ని చెప్పే కేసీఆర్.. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం రావ‌టం వెనుక బ‌ల‌మైన కార‌ణం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

బాబు ఓట‌మి కంటే కూడా జ‌గ‌న్ సీఎం అయితే తిరుమ‌ల‌కు వ‌స్తాన‌ని కేసీఆర్ మొక్కుకున్నారా? అన్న వ్యాఖ్య వినిపిస్తోంది. అయితే.. ఇవ‌న్నీ ఫ‌న్నీగా చేసే కామెంట్లు అని.. ఈ మ‌ధ్య‌న ద‌క్షిణ భార‌త‌దేశంలోని పుణ్య‌క్షేత్రాల్ని ద‌ర్శించుకొచ్చిన కేసీఆర్ ఫ్యామిలీ.. అందులో భాగంగా మిగిలిన తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నం కూడా పూర్తి చేయాల‌న్న త‌లంపుతో ఆయ‌న వెళుతున్న‌ట్లు చెబుతున్నారు.

ఆదివారం ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో క‌లిసి తిరుప‌తికి వెళ్ల‌నున్న ఆయ‌న‌.. అక్క‌డి నుంచి తిరుమ‌ల‌కు వెళ్ల‌నున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేక విమానంలో వెళ్ల‌నున్నారు. ఆదివారం రాత్రి తిరుమ‌ల‌లో బ‌స చేయ‌నున్న కేసీఆర్.. సోమ‌వారం స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోనున్నారు. సోమ‌వారం సాయంత్రం తిరుమ‌ల నుంచి హైద‌రాబాద్ కు రానున్నారు. ఒక్క రోజు అంటే (మంగ‌ళ‌వారం) హైద‌రాబాద్ లో ఉండ‌నున్న ఆయ‌న బుధ‌వారం కుటుంబ  స‌మేతంగా విజ‌య‌వాడ‌కు వెళ్ల‌నున్నారు.

జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి ఒక రోజు ముందుగా బెజ‌వాడ‌కు చేరుకోనున్న కేసీఆర్.. 30న క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకోనున్నారు. అనంత‌రం జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకానున్నారు. చూస్తుంటే.. ఈ రోజు నుంచి 30 వ‌ర‌కు చూస్తే.. ఎక్కువ స‌మ‌యం కేసీఆర్ తెలంగాణ‌లో కంటే ఆంధ్రాలోనే ఎక్కువ‌గా ఉండ‌నున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News