వరంగల్ ఎంజీఎంలో కరోనా రోగులతో సీఎం కేసీఆర్ పరామర్శ !

Update: 2021-05-21 11:30 GMT
తెలంగాణ‌ సీఎం కేసీఆర్ వరంగల్ ఎంజీఎంను సందర్శించారు. సీఎం కేసీఆర్ వెంట‌ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్, వరంగ‌ల్ జిల్లా ప్రజాప్రతినిధులు, ప‌లువురు అధికారులు ఉన్నారు. వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బందితో క‌లిసి ఎంజీఎంలోని సౌక‌ర్యాల‌ను ఆయ‌న అడిగి తెలుసుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న ఆయన.. నేరుగా కోవిడ్ ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. అక్కడ కరోనా వైరస్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. ప్రతీ బెడ్ దగ్గరకూ వెళ్లి కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రిలో సౌకర్యాల గురించి సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

కరోనా వైరస్ కు భయపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆసుప‌త్రిలో పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ఔష‌ధాల‌పై సీఎం కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. ఎంజీఎం పర్యటన అనంతరం వరంగల్‌ సెంట్రల్‌ జైలును పరిశీలించి, జైలు ప్రాంగణంలోని 73 ఎకరాల్లో కొత్త ఆసుప‌త్రి నిర్మాణంపై అధికారులతో మాట్లాడతారు. ఇటీవ‌లే కేసీఆర్ సికింద్రాబాద్‌ లోని గాంధీ ఆసుప‌త్రిలోనూ క‌రోనా రోగుల‌తో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన విష‌యం తెలిసిందే. కాగా, తెలంగాణలో కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో ఇప్పటికే లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు. మే 30 వరకు కఠినమైన ఆంక్షలను విధించారు. ఉదయం 10 తర్వాత ఎలాంటి కార్యకలాపాలకు అనుమతించడం లేదు. ఇక కేబినెట్ నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన తర్వాత స్వయంగా ఆరోగ్యశాఖ బాధ్యతలను చూస్తున్నారు సీఎం కేసీఆర్. అప్పటి నుంచి వరుస రివ్యూలు, ఆస్పత్రుల సందర్శనతో బిజీగా ఉన్నారు.
Tags:    

Similar News