ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం

Update: 2019-12-25 07:37 GMT
పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకత వ్యక్తమవుతోన్న నేపథ్యంలో మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమంలో మద్ధతు కోసం ఓ కార్యక్రమం జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మంగళవారం మాట్లాడుతూ.. 'ముస్లింకు 150దేశాలు ఉన్నాయి. కానీ, హిందువుల కోసం ఉంది భారతదేశం ఒక్కటే' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ నగరంలోని సబర్మతి ఆశ్రమం బయట పౌరసత్వ సవరణ చట్టానికి మద్ధతుగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 డిసెంబరు 31 వతేదీ వరకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చే కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నందుకు ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ను నిందించారు.

1947లో దేశ విభజన జరిగినపుడు పాకిస్థాన్ దేశంలో 22 శాతం మంది హిందువులున్నారని, ఇప్పుడు ఆ దేశంలో నిరంతర హింస కారణంగా హిందువుల జనాభా 3 శాతానికి తగ్గిందని, అందుకే వారు భారతదేశానికి రావాలని కోరుకుంటున్నారని సీఎం అన్నారు. అలాగే రూపానీ మాట్లాడుతూ  ముస్లింలు భారతేదేశంలో సంతోషంగా ఉన్నారు. వారి జనాభా 9నుంచి 14శాతానికి పెరిగింది. రాజ్యాంగం కల్పిస్తున్న భద్రత కారణంగా వారు హుందాతనమైన జీవితం గడుపుతున్నారు అని చెప్పారు.

బాధిత హిందువులకు సహాయం చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని సీఎం విజయ్ రూపానీ ఆరోపించారు. ముస్లిములు 150 దేశాల్లో దేనికైనా వెళ్లవచ్చని. కాని హిందువుల కోసం ఒక్క భారతదేశం మాత్రమే ఉందని, హిందువులు తిరిగి రావాలనుకుంటే సమస్య ఏమిటని విజయ్ రూపానీ ప్రశ్నించారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలను ఎదుర్కోనేందుకు వీలు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సీఏఏ అనుకూల ర్యాలీలు చేయాలని కోరారు.
Tags:    

Similar News